అర్ధరాత్రి శబ్ధాలు భరించలేకున్నా: హరీష్‌ శంకర్‌

17 Feb, 2020 17:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు హరీష్‌ శంకర్  తాను నివాసం ఉంటోన్న జూబ్లీ ఎన్‌క్లేవ్ రెసిడెన్సీకి సమీపంలో అర్ధరాత్రి సమయంలో భవన నిర్మాణ పనులు చేపడుతున్నారని, దానివలన భారీ శబ్దాలు వస్తుండటంతో ఇబ్బందిగా ఉందంటూ ఆదివారం రాత్రి ఓ ట్వీట్‌ చేశారు. 'జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ జనావాస ప్రాంతాల్లో అర్ధరాత్రి పెద్ద శబ్ధాలతో భవన నిర్మాణాలు చేపట్టడానికి మీరు అనుమతిచ్చారా..? న్యాయపరంగా ఫిర్యాదు చేయడానికంటే ముందు మీ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఆదేశాలను నేను పాటిస్తాను' అంటూ హరీష్‌ శంకర్‌ ట్వీట్‌ చేశారు.

దీనికి వెంటనే స్పందించిన పోలీసులు ఆయనకు ఫోన్ చేసి అడ్రస్‌ను అడిగి తెలుసుకుని పెట్రోలింగ్‌ సిబ్బందిని పంపారు. భవన నిర్మాణ పనులు నిలిపేలా చేశారు. పోలీసుల స్పందన పట్ల హరీశ్‌ శంకర్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ రోజు మరో ట్వీట్ చేశారు. ‘నేను నమ్మలేకపోతున్నాను. కొన్ని నిమిషాల్లోనే ఆ శబ్దాలు ఆగిపోయాయి' అని పేర్కొన్నారు. జూబ్లీ ఎన్‌క్లేవ్‌ రెసీడెన్సీలో నివాసముంటున్న వారందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. పోలీసులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని, ఎప్పుడైనా రాగలరని నిరూపించారని అన్నారు. తమ సమస్య పట్ల వెంటనే స్పందించి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని, ప్రజలు మరింత బాధ్యతగా మెలిగేలా చేశారని అన్నారు.

మరిన్ని వార్తలు