మెడల్‌పై గురి

19 Aug, 2018 04:58 IST|Sakshi
హర్షవర్థన్‌ కపూర్‌

పది మీటర్ల దూరంలో టార్గెట్‌ ఫిక్స్‌ చేసుకుని రైఫిల్‌ పట్టుకున్నారు బాలీవుడ్‌ హీరో హర్షవర్థన్‌ కపూర్‌. ఆయన ఏమైనా పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్నారా? ఇంతకీ ఏ విలన్‌పై గురిపెట్టారు? అనే సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే ఇది యాక్షన్‌ మూవీ కాదు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల రైఫిల్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ సాధించిన అభినవ్‌ బింద్రా బయోపిక్‌ కోసం హర్షవర్థన్‌ రైఫిల్‌ పట్టుకున్నారు. ఇప్పుడు అర్థం అయ్యింది కదా. అయిన గురిపెట్టింది సిల్వర్‌స్క్రీన్‌పై గోల్డ్‌ మెడల్‌ కొట్టడానికి అని. కన్నన్‌ అయ్యర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని బీ టౌన్‌ టాక్‌.

ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో స్టార్ట్‌ చేయనున్నట్లు హర్షవర్థన్‌ పేర్కొన్నారు. ‘‘ఈ సినిమా కోసం వచ్చే నెల 15 నుంచి ప్రాక్టీస్‌ స్టార్ట్‌ చేస్తా. రానున్న ఐదు నెలల్లో ప్రతి రోజూ నేను రైఫిల్‌ పట్టుకోవాల్సిందే. అలాగే ఈ సినిమాలో నాకు ఫాదర్‌గా మా నాన్న అనిల్‌కపూర్‌ నటించనున్నారు. చాలా హ్యాపీగా ఉంది. అభినవ్‌ బింద్రా జీవితానికి సంబంధించిన 15–35 ఏజ్‌ మధ్యలోనే ఈ సినిమా ఉంటుంది. సో.. నేను బరువు పెరగాల్సిన అవసరం లేదు’’ అన్నారు హర్షవర్థన్‌ కపూర్‌.

మరిన్ని వార్తలు