ఆ నిర్మాతపై జీవితకాల నిషేధం

31 Oct, 2017 16:23 IST|Sakshi

న్యూయార్క్‌: లైంగిక వేధింపుల ఆరోపణల్లో ఇరుక్కున్న ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టీన్‌పై అమెరికా నిర్మాతల గిల్డ్‌ (పీజీఏ)జీవిత కాల నిషేధం విధించింది. నటీమణుల ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇప్పటికే పీజీఏకు రాజీనామా చేశారు. నిషేధం కారణంగా మున్ముందు కూడా ఆయన పీజీఏ సభ్యత్వం స్వీకరించే అర్హత కోల్పోతారు. వీన్‌స్టీన్‌ను గిల్డ్‌ నుంచి బయటకు పంపే చర్యలు తీసుకోవాలని ఈ నెల 16వ తేదీనే పీజీఏ నిర్ణయించింది. అయితే, బైలాస్‌ ప్రకారం నిర్దేశిత నిబంధనల ప్రకారమే ఆపని చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు చర్య తీసుకోవటానికి 15 రోజుల ముందుగా ఆయనకు నోటీసులు అందజేశారు. స్పందించిన వీన్‌స్టీన్‌ పీజీఏ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

వీన్‌స్టీన్‌ ప్రవర్తనపై వెల్లువెత్తిన పలు ఫిర్యాదులను పరిశీలించిన మీదట... పలువురు బాధితురాళ్లు ఇప్పటికీ తాము పడిన ఇబ్బందులను బహిరంగ పరుస్తున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకుంటున్నట్లు పీజీఏ తెలిపింది. లైంగిక వేధింపుల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పీజీఏ పేర్కొంది. దుష్ప్రవర్తన, వేధింపులకు 1970వ దశకం నుంచీ పాల్పడుతున్నారంటూ వీన్‌స్టీన్‌పై ఇప్పటికే 50 మంది సినీ తారలు ఆరోపణలు చేశారు. ఆయనను బ్రిటిష్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ అకాడెమీ కూడా బహిష్కరించింది. ది వీన్‌స్టీన్‌ కంపెనీ కూడా ఆయన్ను వెళ్లగొట్టింది.

>
మరిన్ని వార్తలు