ఇక్కడైతే బతికిపోయేవాడు

13 Mar, 2020 03:21 IST|Sakshi
హార్వీ వెయిన్‌స్టీన్‌, సింగర్‌ చిన్మయి

హాలీవుడ్‌ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. ఆ తర్వాతే ‘మీటూ ఉద్యమం’ ఊపందుకుంది. ఇటీవల జరిగిన కేసు విచారణలో హార్వీకు 23 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది.  కోర్టు నిర్ణయంపై పలువురు హాలీవుడ్‌ హీరోయిన్లు హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం హార్వీ వయసు 67 ఏళ్లు. ఇదిలా ఉంటే... ఇండియన్‌ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం బాగా ఊపందుకోవడానికి కారణం బాలీవుడ్‌లో నటి తనుశ్రీ దత్తా, సౌత్‌లో సింగర్‌ చిన్మయి. ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేశారు చిన్మయి. ఇప్పుడు హార్వీకి శిక్ష పడిన విషయాన్ని ఉద్దేశించి ‘‘ఇండియాలో పుట్టి ఉండాల్సింది అని హార్వీ అనుకునే వాడేమో. ముఖ్యంగా తమిళ నాడులో. ఇక్కడ ఉండి ఉంటే పార్టీలు చేసుకునేవాడు. తనకి పొలిటికల్‌ పార్టీలు సపోర్ట్‌ చేసుండేవి’’ అని ఇక్కడైతే హార్వీ బతికిపోయేవాడనే అర్థం వచ్చేట్లు చిన్మయి ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు