ఇక్కడ హీరో... అక్కడ విలన్

26 May, 2015 00:05 IST|Sakshi
ఇక్కడ హీరో... అక్కడ విలన్

‘ఆల్ ది రజనీ ఫ్యాన్స్... తలైవా...’ అంటూ హిందీ చిత్రం ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’లో ఆ చిత్రకథానాయకుడు షారుక్ ఖాన్ చేసిన డ్యాన్స్‌ను అంత సులభంగా మర్చిపోలేం. రజనీ మీద ఉన్న అభిమానాన్నంతా ఆ పాటలో చూపించేశారు షారుక్. ఈ హీరోగారంటే రజనీకి కూడా ఇష్టమే. అందుకే షారుక్ నటించిన ‘రా. వన్’లో ఒకే ఒక్క సన్నివేశంలో కనిపించడానికి అంగీకరించారు రజనీ.
 
 ఇప్పుడు ఈ ఇద్దరూ హీరో, విలన్లుగా తమిళ దర్శకుడు శంకర్ తాజా చిత్రం ‘రోబో-2’ లో నటించనున్నారని సమాచారం. తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందట. తమిళ చిత్రంలో రజనీ నాయకునిగా, షారుక్ ప్రతినాయకునిగా కనిపిస్తారట.
 
 కానీ, హిందీ వెర్షన్‌కు వచ్చేసరికి ఒకరి పాత్రలు మరొకరు మార్చుకొని, షారుక్ నాయకునిగా, రజనీ ప్రతినాయకునిగా చేస్తారట. ఇది ఇలా ఉంటే, ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, విక్రమ్‌లతో శంకర్ ప్లాన్ చేశారనీ, ఆ తర్వాత సీన్‌లోకి రజనీ, షారుక్ వచ్చారనీ చెన్నై టాక్.