ఆయన రూటే సెపరేటు!

1 May, 2017 01:34 IST|Sakshi
ఆయన రూటే సెపరేటు!

సినిమాలో సింగిల్‌గా ఎదిగిన వారు చా లా మంది ఉన్నారు. ఇప్పుడు సినీరంగ ప్రవేశం చాలా సులభం కావచ్చు. ఒకప్పడు చాలా కష్టతరం. అప్పట్లో నటుడవ్వడానికే పెద్ద పోరాటం చేయాల్సిఉండేది. అలాంటి సమయంలో పోరాడి గెలిచిన కథానాయకుల్లో నటుడు అజిత్‌ ఒకరు. ఎలాంటి సినీ నేపథ్యం, గాడ్‌ఫాదర్‌ లేకుండా నటుడైన అజిత్‌ నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అందుకు ఆయన చాలానే శ్రమించారనే చెప్పాలి. నటన ను ప్రేమించి, మోహించి, ఆరాధించి, పట్టుదలతో తన లక్ష్యాన్ని సాధించుకున్న నటుడు అజిత్‌. విశ్వనటుడు కమలహాసన్, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ల హవా కొనసాగుతున్న కాలంలో తన కంటూ ఒక మార్గాన్ని ఏర్పరచుకుని జయాపజయాలను అధిగమించి మరో పక్క తన సమకాలీకుడు నటుడు విజయ్‌తో పోటీ పడుతూ ఒక సూపర్‌ నటుడిగా ప్రేక్షకుల మదిలో తన స్థానాన్ని పదిల పరచుకున్న అజిత్‌ ఆర్భాటాలకు, హంగామాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటూ వచ్చారు.

తన అశేష అభిమానులకు తనపై అభిమానం అనే పిచ్చి వద్దు, కన్నవారిపై ప్రేమే ముద్దు అని హితవు పలికి వారికి మార్గదర్శకాలను సూచించిన అరుదైన నటుడు అజిత్‌. అజిత్‌లోని ఆ గుణమే ఆయన అభిమానుల్ని కట్టి పడేసింది. ఆయన వలదన్నా త్యజించేది, తరిగేది కాదు వారి అభిమానం. అందుకే అజిత్‌ చిత్రాలకు నేటికీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. అభిమానులు పూజలు, పాలాభిషేకాలు అంటూ హంగామా చేస్తుంటారు. అన్నదానాలు, రక్తదానాలు అంటూ సామాజిక సేవాకార్యక్రమాలు విరివిగా నిర్వహిçస్తుంటారు. కథానాయకుడిగా ఎదుగుతున్న సమయంలోనే నటి షాలినిని ప్రేమించి పేళ్లాడిన అజిత్‌ది ఇతర తారలకు ఆదర్శ జీవితమే. అజిత్‌ సహజత్వాన్ని ఇష్టపడతారు. అందుకే తొలి రోజుల్లో ప్రేమ కాథా చిత్రాలతో సినీ ప్రియులను అలరించినా, ఆ తరువాత తన వయసుకు తగ్గ పాత్రల్లోనే నటించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయాన్ని ఆహ్వానించిన అభిమానులు ఆ తరహా చిత్రాలను ఆదరిస్తున్నారు. సమీపకాలంలో వచ్చిన మంగాత్తా, ఆరంభం, వీరం, వేదాళం వంటి చిత్రాలను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అందుకే అజిత్‌ రూట్‌ సెపరేట్‌ అంటారంతా. ఇతర విషయాల గురించి అస్సలు పట్టించుకోరు.

తానేమిటో తన పనేమిటో అన్నంతగా ఉంటారు. అంతదాకా ఎందుకు తన చిత్రాల ప్రమోషన్‌ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటారు. సహ నటీనటులను, సాంకేతిక వర్గాన్ని గౌరవిస్తారు. తాజాగా ఈయన వివేగం చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కాజల్‌అగర్వాల్‌ కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ఇందులోనూ అజిత్‌ తన వయసుకు తగ్గ పాత్రలో ఇంటర్‌పోల్‌ అధికారిగా నటిస్తున్నారు. మే ఒకటవ తేదీ ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా వివేగం చిత్ర రెండవ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి అజిత్‌ అభిమానుల్ని ఖుషీ చేయడానికి చిత్ర వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.