క్లాపురం

18 Aug, 2018 00:34 IST|Sakshi
సమంత – నాగచైతన్య: పెళ్లి తర్వాత తొలిసారి కలిసి నటిస్తున్నారు. రారండోయ్‌.. వేడుక చదువుదాం!

‘ఏమండీ షాట్‌ రెడీ’ అంది శ్రీమతి హీరోయిన్‌. ‘భార్యలు బయలుదేరేటప్పుడు లేట్‌ చేస్తారంటారు కానీ నువ్వు సూపర్‌!’ అన్నాడు శ్రీవారు హీరో. ‘సింగిల్‌ కారు పంపితే చాలు.. వర్కవుట్‌ అవుద్ది’ అన్నాడు ప్రొడ్యూసర్‌. ‘ఇంట్లో చిర్రుబుర్రులేమైనా ఇక్కడ చూపిస్తారేమో’ అనుమానంగా అడిగాడు డైరెక్టర్‌. ‘ఇంటిని మరిపించేలా అందమైన సంభాషణలు రాశాను’ అన్నాడు రైటర్‌. ఇదీ.. పెళ్లయిన తరువాత కూడా హీరో హీరోయిన్‌ చేస్తున్న క్లాపురం!

సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. అందులోని హీరో హీరోయిన్‌ జోడీ బాగా కుదిరింది. దర్శక, నిర్మాతలు ఆ జంటను స్క్రీన్‌పై రిపీట్‌ చేయాలనుకుంటారు. అంతలా ఆ స్టార్స్‌ మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్‌ అయినప్పుడు ‘కలిసి నటì స్తే బావుండు’ అని ప్రేక్షకులూ కోరుకుంటారు. హీరో హీరోయిన్‌కి కూడా కలిసి నటించడానికి ఓకే. ముందేమో విడి విడిగా సెట్లోకి వెళ్లేవారు. కానీ సినిమా సెట్లోనే అన్నీ సెట్‌ అయ్యాక, టైటిల్‌ కార్డ్‌లో పేర్లను పెళ్లి కార్డులో చూసుకోవాలనుకున్నారు కొందరు సెలబ్రిటీలు. పెళ్లికి ముందు జంటగా నటించి, పెళ్లయ్యాక కూడా జంటగా కనిపించిన ‘కపుల్స్‌’ కహానీ తెలుసుకుందాం.

విజయకృష్ణ
‘సాక్షి’ సినిమాలో ఫస్ట్‌ టైమ్‌ ఆన్‌ స్క్రీన్‌ జోడీగా కనిపించారు కృష్ణ, విజయనిర్మల. పెయిర్‌ బావుందని ప్రేక్షకులు ఈలలు వేశారు. అంతే... వెంటనే 10–15 సినిమాలు కృష్ణ, విజయనిర్మలకు క్యూ కట్టాయి.  సినిమాలు, సెట్లు మారుతున్నాయి. పోస్టర్‌లో కృష్ణ, విజయ నిర్మల అనే పేరు మారడం లేదు. అలా కలిసి పని చేసే ప్రయాణంలో ఒకరికి ఒకరు దగ్గరయ్యారు. ‘ఎవరే అతగాడు.. అంత అందంగా ఉన్నాడు’ అన్నది కృష్ణని చూడగానే విజయ నిర్మలకు కలిగిన ఫస్ట్‌ ఇంప్రెషన్‌. 

విజయ నిర్మల యాటిట్యూడ్‌ నచ్చి చంద్రమోహన్‌ ద్వారా ప్రేమ కబురును ఆమెకు పంపారు. ఇలా కాదు డైరెక్ట్‌గా వచ్చి చెబితే ఒప్పుకుంటా అన్నారంట. అలా తిరుపతిలో పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి ట్విస్ట్‌ ఇచ్చిందీ జోడీ.  కృష్ణ, విజయ నిర్మల సుమారు  40 సినిమాలకు కలిసి పని చేశారు. జోడీగా కొన్ని సినిమాలు. విజయ నిర్మల దర్శకత్వంలో కృష్ణ హీరోగా కొన్ని సినిమాలు. ‘తాళి బొట్టు, పండంటి కాపురం, మూడు పువ్వులు ఆరు కాయలు, అంతం కాదిది ఆరంభం’ వంటి సినిమాలతో అభిమానులను అలరించారు. స్క్రీన్‌ మీదే కాదు.. ఆఫ్‌ స్క్రీన్‌ కూడా వీరు ‘విజయకృష్ణ’.

ప్లస్సు మైనస్సు కలుసే...
అంబరీష్‌ కొంచెం రెబల్‌ టైప్‌. సుమలత ఏమో మృదు స్వభావి. ఒక్క ప్లస్సు మైనసు కలిసినప్పుడే కదా ఈక్వేషన్‌ సరిగ్గా కుదిరేది. అవును ఈక్వేషన్‌ కరెక్ట్‌గా కుదిరింది. ‘మాది తొలి చూపులోనే ఏర్పడ్డ ప్రేమ కాదు. సినిమాలు చేస్తూ మెల్లిగా ఒకరినొకరు పూర్తిగా తెలుసుకున్నాం. మా మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైంది అంటే కచ్చితంగా చెప్పలేం. అది ప్రేమ అని తెలిసేలోపే మేం ప్రేమలో మునిగిపోయాం’ అని సుమలత ఓ సందర్భంలో పేర్కొన్నారు. తొలిసారి ఈ జంట కన్నడ సినిమాలు ‘ఆహుతి. అవతార పురుష’లో యాక్ట్‌ చేశారు. 1991లో పెళ్లి చేసుకున్న ఈ జంట చిరంజీవి ‘శ్రీమంజునాథ’ కన్నడ ‘కల్లరాలి హోఘొ’ సినిమాల్లో జోడీగా కనిపించారు.


హీ మ్యాన్‌ హేమ జపం
హేమ మాలినీ బాలీవుడ్‌ డ్రీమ్‌ గాళ్‌.  ధర్మేంద్ర హీ మ్యాన్‌. ఈ ఇద్దరూ ‘షరాఫత్‌’ అనే సినిమా కోసం ఫస్ట్‌ టైమ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. 1970లో ‘తుమ్‌ హసీనా మై జవాన్‌’ సినిమా సెట్లో ఇద్దరూ ఒకరి మీద ఒకరు అభిప్రాయాలు ఏర్పరచుకోవడం మొదలెట్టారట. ధర్మేంద్రకు ఆల్రెడీ పెళ్లయింది. అయినా హేమ మాలినీ అందానికి హీ మ్యాన్‌ కాస్తా హేమ జపం చేశారు. మెల్లిగా ఒకరంటే ఒకరు ప్రేమను ఏర్పరచుకుని 5 ఏళ్ల లవ్‌ని పెళ్లితో కొనసాగించారు. పెళ్ళి  తర్వాత రజియా సుల్తాన్, ఆటంక్, వంటి సినిమాల్లో కలిసి నటించారు. ప్రతిజ్ఞ , ఆలీ బాబా 40 చోర్, రజియా సుల్తాన్‌ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో కనిపించారు.


స్నేహం–ప్రేమ–పెళ్లి
కపూర్‌ ఫ్యామిలీ నుంచి వచ్చిన సూపర్‌ స్టార్‌ రిషీ కపూర్, స్టార్‌ హీరోయిన్‌ నీతూ సింగ్‌ లవ్‌ స్టోరీ లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సెట్‌ కాదు. రిషీ కపూర్‌కి బెస్ట్‌ ఫ్రెండ్‌లా ఉండేవారట నీతు. అప్పట్లో రిషీ కపూర్‌కి గర్ల్‌ ఫ్రెండ్స్‌ చాలా ఎక్కువ. వాళ్ళ సీక్రెట్స్‌ అన్నీ తెలిసింది నీతూ సింగ్‌కే నట. ఇన్‌ఫ్యాక్ట్‌ ఎవరైనా గాళ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయితే రిషీ కన్నీళ్లు తుడుచుకునే కర్చీఫ్‌ నీతూదే. తలవాల్చుకునే భుజం కూడా నీతూదే. కానీ అవన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌ అనే విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.

‘బరూద్‌’ షూటింగ్‌ కోసం ప్యారిస్‌ వెళ్లిన రిషీ కపూర్‌కి ఒంటరితనం అంటే ఏంటో అర్థం అయిందట. ఉండబట్టలేక నీతూకు ఓ టెలీగ్రామ్‌ వేసేశారట. ‘ఏ సిక్నీ బడీ యాద్‌ ఆతీ హై’ అని టెలీగ్రామ్‌ వేశాడట. అంటే.. ఎప్పుడూ గుర్తొస్తున్నావు అని. కానీ పెళ్లికి మాత్రం అప్పుడే సిద్ధంగా లేను అని అనుకున్నారట. ‘నీతో డేటింగ్‌ చేయగలను కానీ పెళ్లి చేసుకోలేను’ అనేశారు రిషి. అప్పటికే రిషీ మీద పీకల్లోతు ప్రేమలో ఉన్న నీతు నో చెప్పలేకపోయారు. 5 ఏళ్లు డేటింగ్‌ తర్వాత ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

19 సినిమాల్లో రిషీ, నీతు కలిసి నటించారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు నీతు. రిషీ కపూర్‌ ఆపేయమన్నారని వార్తలు వచ్చాయి. నా అంతట నేను తీసుకున్న నిర్ణయం అని నీతు అన్నారు. అసలు నిజం ఏంటో వాళ్లింటి నాలుగు గోడలకే తెలుసు. మళ్లీ 25 ఏళ్లకు ‘లవ్‌ ఆజ్‌ కల్‌’ అనే సినిమా ద్వారా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు రిషీ, నీతు. ఆ తర్వాత  షారుక్‌ఖాన్‌ ‘జబ్‌ తక్‌ హై జాన్, కుమారుడు రణ్‌బీర్‌ సింగ్‌ ‘బేషరమ్‌’ సినిమాలో ఈ జంట తళుక్కున మెరిసింది.

నిలువెత్తు ప్రేమ
బాలీవుడ్‌ యాంగ్రీ యంగ్‌ మ్యాన్‌ అమితాబ్‌ బచ్చన్,  జయా బచ్చన్‌ల లవ్‌ స్టోరీ కూడా సినిమా సెట్లోనే మొదలైంది. అయినా అమితాబ్‌ స్ట్రగ్లింగ్‌ యాక్టర్‌గా ఉన్నప్పుడు జయా బచ్చన్‌ సూపర్‌ స్టార్‌. కానీ తొలి చూపులోనే అమితాబ్‌ నన్ను ఆకట్టుకున్నాడని చాలా సందర్భాల్లో పేర్కొన్నారామె. అమితాబ్, జయాబచ్చన్‌ తొలిసారి కలిసి నటించిన సినిమా ‘గుడ్డి’. ఈ సినిమా వారికి ఓ  పరిచయ వేదిక.

ఆ తర్వాత సినిమా సినిమాకు వీళ్ళ మధ్య పరిచయం ప్రేమగా మారడం మొదలైంది. సార్‌ చాలా హైట్‌. మేడమ్‌ కొంచెం షార్ట్‌. అయినా ఇద్దరి మనసులో ఉన్న ప్రేమ ఎత్తు చాలా. ‘జంజీర్‌’ సినిమా చేస్తున్న టైమ్‌కు ఇద్దరూ ఒకరి మీద ఒకరికి పీకల్లోతు ప్రేమలో పడిపోయారు. సినిమా హిట్‌ అయితే  లండన్‌ టూర్‌కి వెళ్దాం అనుకున్న ఈ జంటకు వీసా రిజెక్ట్‌ అయినట్లు ఇంట్లో వాళ్ల సమ్మతి లభించలేదు. విడిగా అయితే వీల్లేదు.. జాయింట్‌గా వెళ్లాలనుకుంటే వెళ్లండని స్వీట్‌ ట్విస్ట్‌ ఇచ్చారు.

అనుకున్నదే అదనుగా జయ, అమితాబ్‌ పెళ్లి చేసుకొని ఆ మరుసటి రోజే డ్యూయెట్‌ పాడుకోవడానికి లండన్‌ పయనమయ్యారు. వీళ్లిద్దరూ జంటగా 16 సినిమాలకు పని చేశారు. అందులో ‘షోలే, కభీ ఖుషి కభీ గమ్, జంజీర్‌’ ఉన్నాయి. అమితాబ్‌ బచ్చన్, జయ జోడీగా కనిపించిన లాస్ట్‌ సినిమా ‘కీ అండ్‌ కా’. విశేషం ఏంటంటే... ఈ ప్రేమజంట తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా తన కో–స్టార్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ లవ్‌స్టోరీ గురించి కూడా తెలుసుకుందాం సుమా.

సెట్‌ అయింది సాబ్‌
అజయ్‌ దేవగన్‌ చాలా మొహమాటస్తుడు. కాజోల్‌ అవుట్‌ స్పోకెన్‌. ఈ ఇద్దరూ పెళ్లిని అనౌన్స్‌ చేసినప్పుడు ‘ఈ ఇద్దరికీ సెట్‌ అవ్వదూ’ అంటూ మీడియా కథనాలు రాశాయి. కానీ ఇప్పటికీ బాలీవుడ్‌లో వన్నాఫ్‌ ది బెస్ట్‌ కపుల్స్‌గా ఉన్నారు కాజోల్‌ దేవగన్‌.  వీళ్లద్దరికీ సెట్‌ అయింది సాబ్‌ అని సరదాగా బాలీవుడ్‌లో అంటుంటారు. ‘హల్‌ చల్‌’ సినిమాలో ఫస్ట్‌ టైమ్‌ కలిసి యాక్ట్‌ చేశారు వీరిద్దరూ. 1999లో ఈ ఇద్దరూ ఒకటయ్యారు. పెళ్ళి తర్వాత యాక్ట్‌ చేసిన ఫస్ట్‌ సినిమా ‘దిల్‌ క్యా కరే’. అజయ్‌ దేవగన్‌ దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఫస్ట్‌ సినిమా ‘యు మీ ఔర్‌ తుమ్‌’ చిత్రంలో కలిసి యాక్ట్‌ చేశారు. ఈ కాంబినేషన్‌లో 7 సినిమాలు వచ్చాయి.


మనసులు తెలుసుకున్నాకే...
తండ్రిలానే తనయుడు అభిషేక్‌ బచ్చన్‌ కూడా తన కో–స్టార్‌నే వివాహమాడారు. అభిషేక్, ఐశ్వర్యా రాయ్‌ తొలిసారి కలసి నటించిన చిత్రం ‘కుచ్‌ నా కహా’. అప్పటికే అభిషేక్, కరిష్మా కపూర్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగిపోయింది. మరోవైపు ఐశ్వర్య కూడా కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌తో లవ్‌లో ఉన్న వార్తలు వచ్చాయి. చెరో దారి అన్నట్లుగా ఉన్న ఈ ఇద్దరిదీ ఒకే దారి అయింది. ‘ఉమ్రో జాన్, గురు, ధూమ్‌: 2’.. మూడు సినిమాలతో వరసగా మూడేళ్లు ఒకే సెట్లో ఎక్కువ సమయం గడపడంతో ఇద్దరూ ఒకరిని ఒకరు తెలుసుకున్నారు.

‘గురు’ ప్రీమియర్‌ టైమ్‌లో ఐశ్వర్యారాయ్‌కి అభిషేక్‌ ప్రపోజ్‌ చేయడం, ఐష్‌ కూడా ఆనందంగా ఒప్పుకోవడం జరిగిపోయింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ మణిరత్నం ‘రావణ్‌’ సినిమాలో కలిసి నటించారు. కానీ జోడీగా కాదు. అయితే యాడ్స్‌లో కలసి నటించారు. లేటెస్ట్‌గా అభిషేక్, ఐష్‌ ‘గులాబ్‌ జామున్‌’ సినిమాలో యాక్ట్‌ చేస్తున్నారు.

పదేళ్ల ప్రేమ
మహారాష్ట్ర సీఎం కుమారుడి ఫస్ట్‌ సినిమా. అది కూడా మలయాళంలో బ్లాక్‌బస్టర్‌ అయిన ‘నిరం’ (తెలుగులో ‘నువ్వే కావాలి’గా రీమేక్‌ అయింది). అలా ఫస్ట్‌ టైమ్‌ సెట్లో  మొట్టమొదటిసారిగా కలుసుకున్నారు రితేష్‌ దేశ్‌ముఖ్, జెనీలియా. సీఎం కొడుకంటే హడావుడి ఉంటుంది అనుకున్నారు జెనీలియా. రితేశ్‌ మాత్రం చాలా కామ్‌. సినిమా షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యేసరికి ఒకరికొకరు ‘నువ్వే కావాలి’ అనుకున్నారు. కానీ అనుకున్నంత సులువుగా ఈ లవ్‌ స్టోరీ సెట్‌ అవ్వలేదు.

సినిమాల్లోలానే ఈ సీఎం అంకుల్‌ కూడా ఫస్ట్‌ ఈ మ్యారేజ్‌ ప్రపోజల్‌కి ఒప్పుకోలేదు. అప్పుడు జెన్నీ, రితేష్‌ తీసుకున్న నిర్ణయం వెయిట్‌ చేయడం. సుదీర్ఘంగా 10 ఏళ్లు ఎదురుచూస్తూనే ఉన్నారు. ఫైనల్‌గా సీఎం అంకుల్‌ని కూడా వీళ్ల ప్రేమ మార్చగలిగింది. 2012లో ఈ జోడీ ఒక్కటయ్యారు. కపుల్స్‌ అయ్యాక ‘తేరే నాల్‌ లవ్‌ హోగయా’ అనే సినిమాలో యాక్ట్‌ చేశారు. ఆ తర్వాత రితేష్‌ చేసిన ‘లాల్‌ భారీ’ అనే మరాఠీ సినిమాలో కూడా చిన్న గెస్ట్‌ రోల్‌లో కనిపించారు.

నువ్వు–నేను–ప్రేమ
సూర్య, జ్యోతిక జంటగా ఏడు సినిమాల్లో యాక్ట్‌ చేశారు. సూర్య కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బాస్టర్‌గా నిలిచిన ‘కాక్క కాక్క’ చిత్రం నుంచి వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఈ సినిమాలో సూర్యని హీరోగా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌కు సజెస్ట్‌ చేసింది జ్యోతికే. ఆ తర్వాత ‘మాయావి, సిల్లున్‌ ఒరు కాదల్‌ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’గా విడుదలైంది)’ సినిమాల్లో కనిపించారు. అయితే పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ కలసి నటించలేదు. కానీ సతీమణి కమ్‌బ్యాక్‌ మూవీ ‘36 వయదినిలే’ని సూర్య నిర్మించారు.  ఆ తర్వాత వచ్చిన ‘మగళిర్‌ మట్టుమ్‌’ని కూడా సూర్యనే నిర్మించారు. మరి.. మళ్లీ ఆన్‌ స్క్రీన్‌ కనిపిస్తారా? కాలమే చెబుతుంది.

ఎప్పుడో ముడివేశాడు
తండ్రి నాగార్జున లానే తనయుడు నాగ చైతన్య కూడా తన కో–స్టార్‌నే వివాహం చేసుకున్నారు. ఇలాంటివి ప్లాన్‌ చేసి జరిగేవి కాదు. ఏదో మాయ జరుగుతుంది. ‘ఏ మాయ చేశావే’ సినిమా నాగ చైతన్య–సమంతలను మాయ చేసింది. యూత్‌ని క్లీన్‌ బౌల్డ్‌ చేసిన లవ్‌ స్టోరీ. ‘జెస్సీ, కార్తీక్‌’ యూత్‌ అందర్నీ లవ్‌లో పడేసిన ప్రేమ జంట. ‘పై లోకంలో వాడు ఎపుడో ముడివేశాడు..’ అంటూ సినిమాలో పాడుకున్నారీ జంట.

ఆ క్షణం బహుశా వాళ్లు ఊహించి ఉండరు.. తర్వాత జరగబోయేది అదే అని. ఆ పాటను అనంత శ్రీరామ్‌తో అనంత లోకాలకు స్క్రీన్‌ప్లే  రాసే రైటరే రాయించుంటాడు. కానీ వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ ప్రేమగా మారడానికి టైమ్‌ పట్టింది. ఆ మధ్యలో ‘ఆటోనగర్‌ సూర్య’లో కూడా కలిసి యాక్ట్‌ చేశారు. అక్కినేని నాగేశ్వరరావుకి నివాళిగా కుటుంబం రూపొందించిన ‘మనం’లో కూడా సమంత ఉండటం విశేషం. ఆ తర్వాత ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉందని తెలుసుకున్నారు ఈ జంట.

పబ్లిక్‌గా అనౌన్స్‌ చేయకపోయినా కలిసి సినిమాలు, షాపింగ్‌ అంటూ ప్రేక్షకులకు హింట్‌ ఇచ్చారు. గతేడాది నవంబర్‌లో గ్రాండ్‌గా గోవాలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్నారు. పెళ్ల్లయ్యాక ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివా నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో కలసి యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో సమంత, నాగ చైతన్య పెళ్లైన జంటగానే కనిపించనున్నారు. అన్నట్లు.. రెండు యాడ్స్‌లో కూడా కలసి నటించారు. ప్రేమికులుగా ఉన్నప్పుడు కెమిస్ట్రీ అదిరింది.. భార్యాభర్తల కెమిస్ట్రీ కూడా వండర్‌ఫుల్‌ అంటున్నారు.
ఇన్‌పుట్స్‌: గౌతమ్‌ మల్లాది

మరిన్ని వార్తలు