నాది ఈ-మెయిల్స్ ప్రేమకథ

13 Sep, 2016 21:28 IST|Sakshi
నాది ఈ-మెయిల్స్ ప్రేమకథ

‘‘ఈ సినిమా పేరు మాత్రమే ‘మజ్ను’. రియల్ లైఫ్‌లో నేను ‘మజ్ను’ అయ్యే చాన్సే లేదు. ‘అష్టాచమ్మా’ కంటే ముందు సహాయ దర్శకుడిగా ఉన్నప్పుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. ‘ఈగ’ విడుదల తర్వాత ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను’’ అన్నారు నాని. ఆయన హీరోగా విరించివర్మ దర్శకత్వంలో పి.కిరణ్, గోళ్ల గీత నిర్మించిన సినిమా ‘మజ్ను’. అనూ ఇమ్మాన్యుయేల్, ప్రియాశ్రీ హీరోయిన్లు. ఈ నెల 23న విడుదలవుతోన్న ఈ సినిమా గురించి నాని చెప్పిన సంగతులు..
 
చాలామంది కథలు చెప్తుంటారు, నేను వింటుంటాను. ఒక్కోరోజు మూడ్‌ని బట్టి వినబోయే కథ కచ్చితంగా ఓకే అవుతుందనిపిస్తుంది. నా సెన్స్ నిజమైంది. అనుకున్నట్టు విరించివర్మ మంచి కథ చెప్పాడు. రాజమౌళి, కృష్ణవంశీ, ఇంద్రగంటి మోహనకృష్ణ.. నాకంటే వయసులో పెద్దవారైన దర్శకులతో ఎక్కువ పనిచేశాను. నా దర్శకులందరిలో విరించివర్మ చిన్నోడు. మా ఇద్దరికీ వేవ్‌లెంగ్త్ బాగా కుదిరింది. అనుకున్నట్టుగా సినిమా తీశాడు.
 
ఈరోజుల్లో ప్రేమలేఖలు ఎక్కడా కనిపించడం లేదు. నా రియల్ లైఫ్ ప్రేమకథలోనూ ఈ-మెయిల్సే ఉన్నాయి. ఈ సినిమా భీమవరం నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ప్రేమలేఖలు ఉపయోగించాం. జెన్యూన్ లవ్‌స్టోరీ ఇది. ప్రేమలో విఫలమైన భగ్న ప్రేమికుల్ని ‘మజ్ను’ అంటుంటారు. నా లైఫ్‌లో లవ్ ఫెయిల్యూర్ లేదు. ఈ సినిమా ఎందుకు చేశానంటే.. ప్రేక్షకులెవరూ ‘మజ్ను’లా మారి, చెడిపోకూడదు. ఈ సినిమాతో ‘మజ్ను’ అర్థం మార్చాలనేది మా ప్రయత్నం. ఈ సినిమాలో ‘బాహుబలి’ సహాయ దర్శకుడు ఆదిత్యగా నటించా. వృత్తి పరమైన సన్నివేశాలు ఎక్కడా ఉండవు. ఓ రెండు సీన్స్ కథతో సంబంధం లేకుండా ఎంటర్‌టైన్ చేస్తాయి.
 
నిర్మాత పి.కిరణ్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పట్నుంచో పరిచయం. గీతగారు ప్రొడక్షన్ చూసుకున్నారు. మా టీమ్ మీదున్న నమ్మకంతో సెట్స్‌కి కూడా రాలేదు. మొన్ననే సినిమా చూశారు. ఆయన హ్యాపీ.
 
విడుదలకు ముందే సినిమాలో పాటలన్నీ హిట్టయ్యాయి. రేడియో స్టేషన్ వాళ్లు ఫోన్ చేసి.. ప్రతి పాట బాగుందంటే హ్యాపీగా ఉంది. మామూలు సినిమాను కూడా తన మ్యూజిక్‌తో ఓ రేంజ్‌కి తీసుకువెళ్లే గోపీసుందర్ మంచి పాటలు ఇచ్చారు. ‘నేను లోకల్’తో పాటు ఆ తర్వాత నేను చేయబోయే సినిమాకీ ఆయనే సంగీత దర్శకుడు. సినిమాల కంటే మా ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది.

త్రినాథరావు దర్శకత్వంలో చేస్తున్న ‘నేను లోకల్’ క్రిస్మస్‌కి విడుదలవుతోంది. ఆ తర్వాత డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా చేస్తా.