కథల ఎంపికలో నాన్నగారు కల్పించుకోరు

19 Jun, 2016 23:02 IST|Sakshi
కథల ఎంపికలో నాన్నగారు కల్పించుకోరు

‘నోట్‌బుక్’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు రాజీవ్ సాలూరి.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి వారసునిగా ఇండస్ట్రీకొచ్చినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.
తాజాగా రాజీవ్ నటించిన చిత్రం ‘టైటానిక్’.
జి.రాజవంశీ దర్శకత్వంలో కె.శ్రీనివాసరావు నిర్మించిన ఈ చిత్రం జూలై 1న  విడుదల కానుంది.
ఈ సందర్భంగా రాజీవ్ చెప్పిన విశేషాలు...


ఈ చిత్రంలో కార్తీక్ అనే కాలేజీ కుర్రాడి పాత్రలో నటించా. నేను, హీరోయిన్ ప్రేమించుకుంటాం. మనస్పర్థలు రావడంతో విడిపోతాం. అప్పుడు హీరోయిన్‌ను ఆమె మేనమామకు ఇచ్చి వివాహం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయిస్తారు. ఆ పెళ్లి ‘టైటానిక్’ అనే బోట్‌లో చేయాలనుకుంటారు. ఆ బోట్‌లోకి హీరో ఎలా ఎంటరయ్యాడు? పెళ్లిని ఎలా ఆపగలిగాడు? అన్నదే కథ  గోదావరి నదిలో అంతర్వేది నుంచి అమలాపురం వెళ్లే టైటానిక్ బోట్‌లో ప్రయాణం కావడంతో ‘టైటానిక్’ అని టైటిల్ పెట్టాం.

‘గోదావరి’ చిత్రం కూడా బోట్‌లోనే చిత్రీకరించినా, రెండింటికీ పోలిక లేదు. దేనికదే డిఫరెంట్‌గా ఉంటుంది  ‘సంగీత దర్శకుడివి అయ్యుంటే అండగా ఉండేవాణ్ణి. కానీ, నువ్వు హీరో అయ్యావు. కథల ఎంపికలో నీ నిర్ణయాలు నువ్వే తీసుకో’ అని నాన్నగారు అన్నారు. ఆయన సలహాలు ఇస్తారే కానీ, ఇన్‌వాల్వ్ కారు. ‘టైటానిక్’ తర్వాత ‘కేటుగాడు’ డెరైక్టర్ కిట్టు నల్లూరి దర్శకత్వంలో వెంకటేశ్ బాలసాని నిర్మాతగా ఓ చిత్రం చేయనున్నా.