‘మా’ విభేదాలపై స్పందించిన రామ్‌చరణ్‌

6 Jan, 2020 11:58 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)లో వివాదాలను వాళ్లే పరిష్కరించుకుంటారని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అన్నారు. సినీరంగంలో జరుగుతున్న పరిణామాలను పెద్దలు చూసుకుంటారని చెప్పారు. బందర్ రోడ్డులో హ్యాపీ మొబైల్ స్టోర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. హ్యాపీ మొబైల్ స్టోర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడకు ఎప్పుడు వచ్చినా ఆనందంగా ఫీలవుతానని చెప్పారు.


ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌ 65 శాతం పూర్తైందని, జూలై 30న ఈ సినిమా విడుదలవుతుందని తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు’  ప్రిరిలీజ్‌ వేడుకకు చిరంజీవి హాజరుకావడంపై స్పందిస్తూ.. సూపర్‌స్టార్ మూవీకి మెగాస్టార్ లాంటి వ్యక్తి వెళ్ళడం మంచి పరిణామని వ్యాఖ్యానించారు. తక్కువ సమయంలో సినిమా షూటింగ్‌లు పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు ఆర్ధికంగా లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ నటులు టాలీవుడ్‌కు వస్తుంటే మనం అక్కడికి ఎందుకు అని ప్రశ్నించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీస్టార్ల హవా నడుస్తుందని, ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ రామ్‌చరణ్‌ శుభాకాంక్షలు చెప్పారు. కాగా, హీరో రామ్‌చరణ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు