ప్రేమకథలంటే ఇష్టం

26 Oct, 2019 00:19 IST|Sakshi
శ్రీరాం

‘‘రాగల 24 గంటల్లో’ చిత్రంలో అందరికంటే చివరిగా వచ్చింది నేనే. ‘అసలేం జరిగింది’ అనే తెలుగు సినిమా షూటింగ్‌లో పాల్గొని చెన్నైకి వెళ్లిన తర్వాత శ్రీనివాస్‌ రెడ్డి ఫోన్‌ చేసి, ఈ సినిమా లైన్‌ చెప్పడంతో నచ్చి, చేసేందుకు ఒప్పుకున్నాను’’ అని శ్రీరాం (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ ఫేం) అన్నారు. సత్యదేవ్, ఈషా రెబ్బ, శ్రీరాం, గణేష్‌ వెంకట్రామన్, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రల్లో శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. శ్రీనివాస్‌ కానూరు నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీరాం చెప్పిన విశేషాలు.

► శ్రీనివాస్‌ రెడ్డిగారు నాకు ఫోన్‌ చేసినప్పుడు నా పాత్ర కాదు, పూర్తి కథ చెప్పమన్నాను. ఈ సినిమాలో కథే హీరో. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటూ ఉత్కంఠగా సాగే కథ ఇది. సీరియస్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. ఒక హత్య చుట్టూ కథ నడుస్తుంది. ఓ రకంగా లేడీ సెంట్రిక్‌ సబ్జెక్ట్‌ అని చెప్పొచ్చు. చాలా ఉత్కంఠగా సాగుతుంది.

► ఈ చిత్రం స్క్రిప్ట్‌ మొత్తం 24 గంటల్లో నడిచే కథ. వాతావరణ విషయాల గురించి రేడియోలలో చెప్పేటప్పుడు ‘రాగల 24 గంటల్లో’ అని చెబుతుండటం మనకు తెలిసిందే. అందుకే ఈ కథకు ఆ టైటిల్‌ కరెక్టుగా సరిపోతుందని పెట్టాం. ఈ చిత్రంలో పోలీస్‌ పాత్ర చేశా. నా గత పోలీస్‌ చిత్రాలతో పోలిస్తే ఇందులో నా పాత్ర ఇంకా డెప్త్‌గా ఉంటుంది. తమిళంలో కూడా ఓ చిత్రంలో ఇలాంటి పోలీస్‌ పాత్ర చేస్తున్నాను.

► మర్డర్‌ మిస్టరీ కథాంశంతో చాలా సినిమాలు గతంలో వచ్చాయి. అయితే ప్రతి దర్శకుడు కొత్తగా చెప్పాలని ప్రయత్నిస్తారు. శ్రీనివాస్‌ రెడ్డి ఒక భిన్నమైన ట్రీట్‌మెంట్‌తో ఈ సబ్జెక్ట్‌ని తెరకెక్కించారు. పేర్లు అయిపోగానే నేరుగా అసలు కథలో లీనమవుతారు ప్రేక్షకులు. ఎక్కడా సాగతీత ఉండదు.

► తెలుగు సినిమాల్లో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే. అయితే మంచి కథలు కుదరకపోవడం వల్లే చేయడం లేదు. ప్రస్తుతం తెలుగులో ‘అసలేం జరిగింది’ చిత్రంతో పాటు కొత్త దర్శకుడు మధుకర్‌తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. రొమాంటిక్‌ లవ్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. లవ్‌ ఎంటర్‌టైనర్‌లలో నటించడం నాకు చాలా ఇష్టం. తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. కానీ తమిళంలో మాత్రం రావడం లేదు.

► తమిళంలో లక్ష్మీరాయ్‌ హీరోయిన్‌గా ఒక చిత్రం, హన్సికతో మరో సినిమా..  ఇంకా 4 చిత్రాల్లో హీరోగా చేస్తున్నాను. ఆరు చిత్రాల్లోనూ నావి మంచి పాటలే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా