నెల్లూరుది ప్రత్యేక స్థానం : హీరో సూర్య

17 Jan, 2018 12:26 IST|Sakshi

‘గ్యాంగ్‌’ విజయం కొత్త ఉత్తేజం నింపింది

విజయోత్సవ యాత్రలో సినీ హీరో సూర్య

సాక్షి, నెల్లూరు: చిత్ర పరిశ్రమలో నెల్లూరుది ప్రత్యేక స్థానమని సినీ నటుడు సూర్య పేర్కొన్నారు. నెల్లూరులోని ఎంజీబీమాల్‌కు గ్యాంగ్‌ చిత్ర బృందం విజయయాత్రలో భాగంగా మంగళవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా చిత్రం ప్రదర్శిమవుతున్న థియేటర్‌లోకి హీరో సూర్య, చిత్రం బృందం వెళ్లి ప్రేక్షకులతో మాట్లాడారు. ఈ క్రమంలో గ్యాంగ్‌ చిత్రాన్ని విజయవంతం చేసిందనందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నెల్లూరంటే తనకు ఎంతో ఇష్టమని, ఎంజీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గంగాధర్‌ ఇచ్చిన ఆహ్వానం సంతోషం కల్పించిందన్నారు. అనంతరం సూర్య  విలేకరులతో మాట్లాడుతూ ఏడాది క్రితం నెల్లూరుకు వచ్చానన్నారు. గ్యాంగ్‌ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు రిసీవ్‌ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ, రాజమండ్రి, వైజాగ్‌ ప్రాంతాల్లో ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తున్నాయని, నెల్లూరులో కూడా హౌస్‌ఫుల్‌ కలెక్షన్‌తో ప్రదర్శితమవుతోందని తెలిపారు. గ్యాంగ్‌ సినిమా తన జీవితంలో అత్యంత ముఖ్యమైందని, సంక్రాంతి బరిలో భారీ పోటి ఉన్నప్పటికీ ఈ చిత్రం విజయవంతమవడం సంతృప్తికరంగా ఉందన్నారు. మరో 10 రోజుల్లో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి కథానాయికలుగా కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. నెల్లూరు ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణ మరువలేనిదన్నారు. సమావేశంలో ఎంజీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గంగాధర్, ఎస్‌2 నిర్వాహకుడు మాగుంట ఆదిత్యబాబు పాల్గొన్నారు.

ఎంజీబీమాల్‌లో కోలాహలం
హీరో సూర్య వస్తున్నారని తెలియడంతో ప్రేక్షకులు భారీగా ఎంజీబీమాల్‌కు చేరుకున్నారు. ఒంటి గంటకు రావాల్సిన సూర్య గంటన్నర ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రేక్షకులు వేచిచూశారు. దీంతో ఆ ప్రాంతంలో అరుపులు, ఈలలతో కోలాహలం నెలకొంది. అనంతరం సూర్య రాగానే నాలుగో అంతస్తుకు చేరుకుని ప్రేక్షకులకు అభివాదం చేశారు. ఓ అభిమాని సూర్యతో సెల్ఫీ దిగేందుకు యత్నించగా బౌన్సర్లు అతడిని తోసేసే ప్రయత్నం చేశారు. అయితే దీన్ని గమనించిన సూర్య ఆ వ్యక్తితో సెల్ఫీ దిగడం గమనార్హం. 

మరిన్ని వార్తలు