ప్రభుత్వం తలచుకుంటే..

6 Feb, 2019 12:18 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న విశాల్‌ సభ్యులు

పెరంబూరు: ప్రభుత్వం తలచుకుంటే ఒక్క రోజులోనే పైరసీకి పాల్పడుతున్న తమిళ్‌ రాకర్స్‌ వెబ్‌సైట్‌ ఆట కట్టించవచ్చునని నటుడు, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్‌ అన్నారు. తమిళ్‌రాకర్స్‌ను అడ్డుకోలేకపోయారు గానీ, ఇళయరాజా, ఏఆర్‌.రెహ్మాన్‌లకు అభినందన సభలు నిర్వహించడానికి బయలుదేరారు. తమిళ్‌రాకర్స్‌ను అడ్డుకోవడం తన వల్ల కాకపోతే నిర్మాతల మండలి అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని దర్శకుడు వసంతబాలన్‌ ఇటీవల జరిగిన ఓ చిత్ర ఆడియో విడుదల వేదికపై విశాల్‌ను ఘాటుగా విమర్శించారు. ఇదిలాఉండగా ఇళయరాజా సత్కార కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించినందుకుగానూ ముఖ్యమంత్రికి ఎడపాడి  పళనిస్వామిని మంగళవారం విశాల్, ఆయన బృందం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విశాల్‌ మీడియాతో మాట్లాడుతూ తమిళ్‌ రాకర్స్‌ తదితర ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్లను నిలువరించడం అంత సులభం కాదన్నారు.

తాను మాత్రమే ఆన్‌లైన్‌ పైరసీలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే సరిపోదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలచుకుంటే ఒక్క రోజులోనే తమిళ్‌ రాకర్స్‌ వంటి వెబ్‌సైట్లను అంతం చేయవచ్చునని అన్నారు. ఈ సమస్య గురించి ఇంతకు ముందే ప్రభుత్వానికి విన్నవించుకున్నామని, ఇప్పుడు మరోసారి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నటుడు పార్థిబన్‌ మండలి ఉపాధ్యక్ష పదవి నుంచి వైదొలగడం గురించి అడిగిన ప్రశ్నకు విశాల్‌ బదులిస్తూ ఇళయరాజాను, ఏఆర్‌.రెహ్మాన్‌లకు ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఘనత పార్థిబన్‌దేనని అన్నారు. ఇళయరాజా అభినందన సభకు అందరినీ ఆహ్వానించినట్లూ, అయితే అందులో పాల్గొనేదీ, లేనిదీ వారి ఇష్టం అని విశాల్‌ పేర్కొన్నారు. సంగీత కార్యక్రమానికి ఎంత ఆదాయం వచ్చిందన్న ప్రశ్నకు లెక్కలు అన్నీ చూసిన తరువాత బహిరంగంగా ఆ వివరాలను తెలియజేస్తామని అన్నారు. నడిగర్‌ సంఘ భవన నిర్మాణం ఎంతవరకు వచ్చిందన్న ప్రశ్నకు దాదాపు పూర్తి అయ్యిందని, సినీ కార్యక్రమాలకు హాలు నిర్మాణం మాత్రమే పూర్తి కావలసి ఉందని, జూలైలో సంఘం భవన ప్రారంభోత్సవం ఉంటుందని విశాల్‌ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు