సినీ వేడుకలు వ్యాపారంగా మారుతున్నాయి

18 Jun, 2018 08:00 IST|Sakshi
విశాల్‌

తమిళసినిమా: సినిమా వేడుకలు వ్యాపారంగా మారుతున్నాయి. ఇకపై అలాంటి కార్యకమాల్లో పాల్గొనే నటీనటులకు ప్రయోజనం కలగాలని, లేని పక్షంలో అలాంటి వేడుకల్లో పాల్గొనరాదని దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్వాహకులు శనివారం తీర్మానం చేశారు. దీనిపై  సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ చాలా కాలంగా చిత్రసీమలో సినీ కార్యక్రమాలు, అవార్డు వేడుకలు, డాన్స్‌ ప్రొగ్రాంలు, టీవీ అవార్డుల వేడుకలు అంటూ పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయా కార్యక్రమాల్లో నటీనటులు పాల్గొంటున్నారు.

అయితే సమీప కాలంలో అలాంటి వేడుకలు వ్యాపారంగా మారాయి. వాటి ద్వారా నటీనటులు ప్రయోజనం పొందాలన్న విషయం గురించి సంఘం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇలాంటి వేడుకల్లో పాల్గొనే నటీనటులు ఆర్థిక ప్రయోజనం పొందే విధంగానూ, లేకపోతే నిర్మాతల మండలి, నటీనటుల సంఘం సంక్షేమానికి నిధిని అందించే వారి వేడుకల్లోనే పాల్గొనాలి. ఈ నిర్ణయం తీసుకున్న తరువాత జరిగిన కలర్స్‌ టీవీ, విజయ్‌ టీవీ, గలాట్టా డాట్‌కామ్‌ అవార్డుల కార్యక్రమాలకు ఈ విధానాన్ని అవలంభించి విరాళాన్ని తీసుకుని సంఘ ట్రస్ట్‌ కార్యక్రమాలు వినియోగిస్తున్నాం.

త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ విధానాన్ని ఆ వేడుక నిర్వాహకులకు వివరించాం. అయితే వారు సహకరించలేదు. ఆ కార్యక్రమంలో నటీనటులు పాల్గొనరాదని విన్నపం చేస్తున్నాం. ఇందుకు సహకరించిన నటి నయనతార, కుష్బూ, సుందర్, విజయ్‌సేతుపతి, కార్తీ వంటి వారికి నటీనటుల సంఘం కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఇకపై ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులు సహకరించగలరని కోరారు.

మరిన్ని వార్తలు