నా చిరకాల వాంఛ అది.. : వేద

7 Oct, 2014 22:59 IST|Sakshi
నా చిరకాల వాంఛ అది.. : వేద

అందం, అభినయం, నాట్యం... వెరసి అర్చన అలియాస్ వేద. ‘నేను’ చిత్రంతో తెలుగు తెరపైకొచ్చిన ఈ తెలుగమ్మాయి... అనతికాలంలోనే యువతరం అభిమాన తారగా ఎదిగారు. పరభాషా నాయికల ప్రవాహంలో కొట్టుకుపోకుండా... ఎప్పటికప్పుడు, ఏదో ఒక పాత్రతో ప్రత్యేకత చాటుకుంటూనే ఉన్నారు. నేడు వేద పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘సాక్షి’ జరిపిన సంభాషణ.
 
 తెలుగమ్మాయి అవడం వల్లే అవకాశాలు తక్కువగా వస్తున్నాయా?
 నేను బిజీగా లేనని ఎవరన్నారు? కెరీర్ మొదలైనప్పట్నుంచీ ఏనాడూ ఖాళీగా లేను. ఏదో ఒక సినిమా చేస్తూనే ఉన్నాను. ప్రస్తుతం తెలుగులో రెండు, తమిళంలో రెండు, కన్నడంలో పునీత్‌రాజ్‌కుమార్ సరసన ఓ సినిమా చేస్తున్నాను. రీసెంట్‌గా నేను నటించిన  ‘కమలతో నా ప్రయాణం’ చిత్రం అంతర్జాతీయ చిత్రోత్సవానికి ఎంపికైంది. పురస్కారాలు కూడా వస్తాయని  ఆశిస్తున్నాను. నటిగా విభిన్నమైన పాత్రలు చేసే అవకాశాలు నాకొస్తున్నందుకు ఎప్పటికప్పుడు సంతోషిస్తూనే ఉంటాను. పరిశ్రమలో ఎవరికుండాల్సిన అవకాశాలు వారికుంటాయి. ఇక్కడ మనం వారిని పరభాష నాయికలంటాం. మరి నేను తమిళంలో, కన్నడంలో చేస్తున్నాను. వాళ్లకు పరభాషా నాయికనేగా? కళాకారులకు ప్రాంతంతో పని ఉండదు.
 
 సినిమా కోసమే క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారా?
 మా అమ్మ నాకు నడకతో పాటు నాట్యం కూడా నేర్పింది. నా రెండో ఏటే నాట్యం నా జీవితంలోకి ప్రవేశించింది. అమ్మ కూడా నర్తకి. పేరు విజయశాస్త్రి. చిన్నప్పట్నుంచీ అమ్మ నాట్యాన్ని చూస్తుండేదాన్ని. చూసి చేసేదాన్ని. నాలోని జిజ్ఞాసను గమనించి పసి ప్రాయం నుంచే నాట్యాన్ని నేర్పించడం మొదలుపెట్టింది అమ్మ.
 
 సాగరసంగమం, స్వర్ణకమలం లాంటి చిత్రాలు ఇప్పుడు రావడం లేదు. ఏమైనా బాధ ఉందా?
 ఎందుకుండదండీ... అసలు అలాంటి పాత్రలు దొరికితే... నేనేంటో చూపిస్తా. నా చిరకాల వాంఛ అది.
 
 నటిగా గుర్తుండిపోయిన సందర్భాలు?
 కె.రాఘవేంద్రరావుగారి ‘శ్రీరామదాసు’లో సీత పాత్ర నాకెంతో పేరు తెచ్చింది.  రాజమౌళిగారి ‘యమదొంగ’లో ఓ పాట చేశాను. అలాంటి లెజెండ్స్ సినిమాల్లో నటించినా నాకింకా తృప్తి తీరలేదు. వారి దర్శకత్వంలో పూర్తిస్థాయి సినిమాల్లో నటించాలనుంది.
 
 కథానాయికలపై వచ్చే రూమర్లపై మీ స్పందన?
 బాలీవుడ్‌లో ఇలాంటివి ఎక్కువ. అక్కడ హీరోలకు దీటుగా హీరోయిన్లకూ ఇమేజ్ ఉంటుంది కాబట్టి, ప్రతి దానికీ వారు ధైర్యంగా స్పందిస్తారు. కానీ ఇక్కడ హీరోల డామినేషన్. అందుకే... కథానాయికలు అంతగా స్పందించరు. ఇక నా విషయానికొస్తే... అలాంటి విషయాలకు నేను దూరం. నాకు పనే ముఖ్యం. నేను వర్క్‌హాలిక్. 24 గంటలు పని చేసిన రోజులున్నాయి. మన పని మనం చేసుకుంటున్నంత వరకూ మనపై ఎలాంటి అసత్య ప్రచారాలు రావని నా నమ్మకం.
 
 ఇంతకూ మీ పెళ్లెప్పుడు?
 ఏమో... నేను ఏదీ ప్లాన్ చేసుకోను. ఏటైమ్‌లో జరగాల్సింది ఆ టైమ్‌లో జరుగుతుంది... అంతే.
 
 ప్రేమ వివాహమా? లేక పెద్దలు కుదిర్చిన పెళ్లా?
 ఆ రెండు విధానాలపై నమ్మకం ఉంది. ప్రేమించినా, పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లిలోనే కిక్ ఉంటుంది.
 
 ఇంతకీ అబ్బాయి తారసపడ్డాడా?
 లేదండీ... రాసిపెట్టి ఉన్నప్పుడు రాకపోతాడా (నవ్వుతూ).