ఆ హీరోయిన్‌ పారితోషికం ఆరు కోట్లా?

31 Aug, 2017 20:10 IST|Sakshi
ఆ హీరోయిన్‌ పారితోషికం ఆరు కోట్లా?

ఇది విన్నారా ? హీరోయిన్‌ నయనతార ఒక చిత్రంలో నటించడానికి ఆరుకోట్ల పారితోషికాన్ని డిమాండ్‌ చేసిందట. ఏమిటీ నమ్మశక్యంగా లేదా ? నిజమే మరి ఇప్పటి వరకూ దక్షిణాదిలో ఆరు కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిన హీరోయిన్‌ లేదు కాబట్టి ఎవరికైనా నమ్మబుద్దికాదు.  నయనతార కోలీవుడ్‌లో అయ్యా చిత్రం ద్వారా మాలీవుడ్‌ నుంచి దిగుమతి అయ్యింది. తొలి చిత్రమే ఈమెకు  విజయానందాన్ని మిగిల్చింది. ఆ తరువాత ఎప్పుడైతే రజనీకాంత్‌తో చంద్రముఖి చిత్రంలో నటించిందో ఇక ఆ తరువాత నయనతార మార్కెట్‌ సరఫరా పెరిగిపోయింది.

గజని, బిల్లా, యారడీ, నీ మోహినీ, బాస్‌ ఎన్గిర భాస్కరన్‌, రాజారాణి వంటి చిత్రాల విజయం ఈ బ్యూటీని టాప్ హీరోయిన్‌ రేంజ్‌లో కూర్చోబెట్టాయి. ఆ తరువాత నానుమ్‌ రౌడీదాన్‌ చిత్రంలో చెవిటి యువతిగా నటించిన పాత్ర, మాయ చిత్రంలో దెయ్యం పాత్రలు ఆమెను లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల కథానాయకిని చేశాయి. నిజ జీవితంలో ప్రేమ, పెళ్లి అంశాల వివాదాంశంగా మారినా నయనతార మార్కెట్‌కు అవి ఎలాంటి భంగం కలిగించలేదు. ప్రస్తుతం అరం, ఇమైకా నోడిగళ్‌, కొలైయూర్‌ కాలం వంటి హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాలతో పాటు, శివకార్తీకేయన్‌కు జంటగా నటించి వేలైక్కారన్‌ చిత్రాలు వరుసగా విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

కాగా ఈ అమ్మడు తన పారితోషికాన్ని రెండు కోట్ల నుంచి పెంచుకుంటూపోతోంది. ప్రస్తుతం నటిస్తున్న ఇమైకానోడిగళ్‌ చిత్రానికి నాలుగు కోట్లు పారితోషికం పుచ్చుకుందనే టాక్‌ కోలీవుడ్‌ వర్గాల్లో ఉంది. నయనతారకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ ఉంది. శ్రీరామరాజ్యం, సింహా వంటి చిత్రాలు మంచి ఇమేజ్‌ను కట్టబెట్టాయి. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవికి జంటగా నటించే అవకాశం ఈ ముద్దుగుమ్మను వరించింది. చరిత్ర వీరయోధుడి జీవిత కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సైరా నరసింహారెడ్డి అనే టైటిల్‌ను నిర్ణయించారు.

ఈ సినిమాలో చిరంజీవితో పాటు, బాలీవుడ్‌ బిగ్‌ బీ, శాండిల్‌వుడ్‌ సుధీప్, కోలీవుడ్‌ యువ నటుడు విజయ్‌సేతుపతి అంటూ భారతీయ నటీనటుల మేలి కలయికలో రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి నయనతార ఆరు కోట్ల పారితోషికాన్ని డిమాండ్‌ చేసినట్లు ప్రచారం సోషల్‌ మీడియాల్లో హల్‌చల్‌ చేస్తోంది. సైరా నరసింహారెడ్డి చిత్రం తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో తెరక్కుతున్న భారీ చిత్రం కావడం, కాల్‌షీట్స్‌ అవసరం అవ్వడంతో నయనతార అంతే స్థాయిలో పారితోషికం డిమాండ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత అన్నది ఆ చిత్ర వర్గాలకే తెలుసు.