100 అవకాశాలొచ్చాయి.. కానీ : నటి

22 Feb, 2018 11:16 IST|Sakshi
హీరోయిన్‌ ​నిత్యామీనన్‌

సాక్షి, చెన్నై: కమర్షియల్‌ కథా చిత్రాలు సక్సెస్‌ కావచ్చు. తద్వారా కలెక్షన్ల వర్షం కురిపించవచ్చు. అందులో నటించిన నటీనటులకు మరిన్ని అవకాశాలు రావడానికి కారణం కావచ్చు. అయితే నటీనటులు, సాంకేతిక వర్గాల ప్రతిభకు సాన పెట్టేవి, పేరు తెచ్చిపెట్టేవి, పది కాలాల పాటు గుర్తుండిపోయేవి ప్రయోగాత్మక కథా చిత్రాలే. అలాంటి కథా పాత్రలే నటీనటుల నట దాహార్తిని తీరుస్తాయి. 

అలాంటి ఒక చిత్రంలో హీరోయిన్‌ ​నిత్యామీనన్‌ నటిస్తున్నారన్నది తాజా సమాచారం. పాత్ర నచ్చితేనే అంగీకరించే అతి కొద్దిమంది హీరోయిన్లలో ఈమె ఒకరు. నచ్చకపోతే నటించడానికి ససేమీరా అంటారు. ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో తనకు 100 అవకాశాలు వచ్చాయని, అందులో నాలుగే నాలుగు చిత్రాలను అంగీకరించి నటించానని చెప్పుకొచ్చారు. 
అదే విధంగా ఇటీవల తెరపైకి వచ్చిన తెలుగు చిత్రం ‘అ’లో వివాదాస్పద పాత్రలో నటించడానికి వెనుకాడలేదీ జాణ.  

ప్రస్తుతం తాను మాత్రమే నటించే ఒకే ఒక్క పాత్రతో కూడిన ప్రణా అనే చిత్రంలో నటిస్తున్నారట. ఈ విషయాన్ని  ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఇది బహుభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. దీనికి వీకే.ప్రకాశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆస్కార్‌ అవార్డు గ్రహీత రసూల్‌ పూకుట్టి సౌండ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుందన్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని ఛాయాగ్రాహకుడు పీసీ.శ్రీరామ్‌ తెలిపారు. ఒక్క పాత్రతో తెరకెక్కుతున్న చిత్రం అంటే ప్రణా కచ్చితంగా వైవిధ్యంగానూ, ప్రయోగాత్మకంగానూ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా. అందులోనూ ఆ ఒక్క పాత్రను ప్రతిభాశాలి నిత్యామీనన్‌ పోషిస్తున్నారంటే అందులో విషయం ఉండే ఉంటుంది.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు