నేనూ బాధితురాలినే..! నటి

15 Apr, 2018 21:52 IST|Sakshi
హీరోయిన్‌ నివేథా పేతురాజ్‌

మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సమాజంలో స్త్రీలకు భద్రత కరువైంది. కామాంధుల పసివాళ్లను కూడా వదలడం లేదు. జమ్మూ కశ్మీర్‌లోని కథువా అనే ప్రాంతంలో చిన్నారిపై జరిగిన అత్యాచార దుర్ఘటన దేశంలో సంచలనం రేపింది. ఈ దురాఘాతాన్ని చాలా మంది ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. అదే విధంగా అత్యాచారాలపై పలువురు సినీతారలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎదుగుతున్న నివేథా పేతురాజ్‌ నేనూ అత్యాచార బాధితురాలినే అని పేర్కొంది.

ఆమె ఏమన్నారంటే..‘తమిళనాడులో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. అందులో కొన్ని సమస్యలు జాగ్రత్త వహిస్తే మనం అడ్డుకోవచ్చు. అలాంటి వాటిలో స్త్రీల రక్షణ. చిన్నతనంలోనే మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి.  ఆ బాధింపుకు నేను ఐదేళ్ల వయసులోనే గురయ్యాను. ఆ విషయాన్ని అప్పుడు అమ్మానాన్నలకు ఎలా చెప్పగలను. అసలు ఎం జరిగిందో తెలియని వయసు’ అని చెప్పారు.

‘తల్లిదండ్రులకు నేను చెప్పెదేమిటంటే.. మీ పిల్లలతో ఎవరు మాట్లాడుతున్నారు? ఎలా ప్రవర్తిస్తున్నారు? అనే విషయంపై శ్రద్ధ చూపండి. పిల్లల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. మనం పోలీసులను నమ్మి ఉండలేం. మీ వీధిలో యువకులు చర్యలపైనా ఒక కన్నేసి ఉండాలి. ఏమైనా తప్పు జరుగుతుంటే అడ్డుకోవాలి. ఇప్పుడు కూడా నాకు బయటకు వెళ్లాలంటే భయం. అత్యాచార చర్యలు బాలా బాధాకరం. ఇలాంటి వాటిని అణచివేస్తేనే ప్రశాంతంగా జీవించగలం’ అని నటి నివేథా పేతురాజ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు