‘మేకప్‌తోనే అందం వస్తుందంటే నమ్మను’

8 Sep, 2019 08:17 IST|Sakshi

‘ఆషికీ–2’ ‘ఏక్‌ విలన్‌’ ‘హైదర్‌’ ‘ఓకే జాను’ సినిమాలతో బాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న  శ్రద్ధా కపూర్‌ ‘సాహో’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆమె అంతరంగ తరంగాలు...

స్టైల్‌ స్టేట్‌మెంట్‌
నేను నాలాగే ఉండాలనేది నా స్టైల్‌ స్టేట్‌మెంట్‌. ఎవరినో అనుకరిస్తే మిగిలేది ‘అనుకరణ’ తప్ప ‘అందం’ కాదు! నా దృష్టిలో నేచురల్‌ బ్యూటీ ప్రొడక్ట్‌ అంటే... మాంచి నిద్ర! ఒళ్లు తెలియకుండా నిద్రపోయేవాళ్లను చూస్తే ముచ్చటేస్తుంది. సరిౖయెన నిద్ర లేకపోతే  ఎంత కష్టపడి ఏంలాభం! సరిౖయెన నిద్ర, ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం, అందంగా ఉంటాం!

అందం
విశాల్‌ భరద్వాజ్‌ ‘హైదర్‌’ సినిమాలో కశ్మీరీ అమ్మాయి ‘అర్షియా’ పాత్ర పోషించాను. మేకప్‌ లేకుండా నటించాను. ‘అందంగా కనిపించలేదు’ అని ఒక్కరూ అనలేదు. మేకప్‌తోనే అందం వస్తుందంటే నేను నమ్మను. నిజంగా చెప్పాలంటే మేకప్‌ లేకపోతేనే నాకు సౌకర్యంగా, సంతోషంగా, సహజంగా అనిపిస్తుంది. కానీ సినిమాల్లో ఉన్నాం కాబట్టి తప్పదు కదా! ఒత్తిడి లేకుండా ఉండాలంటే?

ఈ పెద్ద ప్రశ్నకు చిన్న సమాధానం... పని!
అదేమిటీ పనితోనే కదా ఒత్తిడి వచ్చేది అంటారా! పని మీద ప్రేమ ఉంటే... ఒత్తిడే ఉండదు. నావరకైతే ఫిల్మ్‌సెట్‌లో లేనప్పుడే ఒత్తిడికి గురవుతాను. ‘ఇప్పుడు ఏం చేయాలి?’ ‘ఇప్పుడు ఏం చేయాలి?’ అని పదేపదే ఆలోచిస్తూ ఒత్తిడికి గురవుతుంటాను. ఒత్తిడిని దూరంగా ఉంచడానికి మరో మార్గం  కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడపడం. ఈ పని నేను ఎక్కువగా చేస్తుంటాను.

అంతమాత్రాన...
నా పనికి ఎంత న్యాయం చేశాను? అనేదే ఆలోచిస్తాను తప్ప... హిట్, ఫ్లాప్‌లను మనసుకు తీసుకోను. ఫ్లాప్‌ ఎదురైందని బాధ పడితే ‘బాధ’ తప్ప ఏమీ మిగలదు కాబట్టి బాధపడడం ఎందుకు? స్క్రిప్ట్‌ వింటున్నప్పుడు ‘ఈ సినిమా కచ్చితంగా హిట్‌ కొడుతుంది’ అనిపిస్తుంది. అన్నిసార్లూ మన అంచన నిజం కాకపోవచ్చు. జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లో ఉన్నాయి. దాన్ని మనం అంగీకరించాల్సిందే.

దె....య్యం!
చిన్నప్పుడు దెయ్యాల కథలు, దెయ్యాల సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. ‘జీ హారర్‌ షో’ అంటే చాలా ఇష్టం. మిస్టరీలను ఛేదించే ఆటలు ఆడేవాళ్లం. ఆత్మలు ఉన్నాయా? లేవా? అనేది నేను కచ్చితంగా చెప్పలేనుగానీ... ఒకసారి సెట్స్‌లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. చాలా ఎత్తు నుండి లైట్‌–మ్యాన్‌ హఠాత్తుగా కిందపడిపోయాడు. ఏదో అదృశ్యశక్తి తనను నెట్టివేసిందని చెప్పడంతో మేమంతా ఆశ్చర్యపోయాం!

>
మరిన్ని వార్తలు