-

దెబ్బలు తినేవారెవరూ లేరు: కార్తీక

9 Jul, 2013 15:00 IST|Sakshi
దెబ్బలు తినేవారెవరూ లేరు: కార్తీక

దర్శకుల చేత హీరోయిన్లు చివాట్లు, చెంప దెబ్బలు తినడం అనేది పాత రోజుల్లోనే అని, ఇప్పుడు అలా పడే వారెవరూ లేరంటోంది కార్తీక. ఈ బ్యూటీ ఒక నాటి అందాల తార రాధ కూతురన్న విషయం తెలిసిందే. హీరోయిన్లు సరిగా నటించకపోతే భారతీరాజా లాంటి కొందరు దర్శకులు చెయ్యి చేసుకునేవారనే విషయం ప్రచారంలో ఉంది. అప్పట్లో భారతీరాజా కోపానికి గురైన హీరోయిన్ల జాబితాలో రాధ సైతం ఉంది. ఇటీవలే భారతీరాజా దర్శకత్వంలో రాధ కుమార్తె కార్తీక నటించింది. ఈ బబ్లీగర్ల్ చెబుతున్న చిత్రా విశేషాలేమిటో చూద్దాం.
 
 ప్ర : మీ తల్లి రాధ స్థానానికి చేరుకుంటారా?
 జ : అమ్మ, పెద్దమ్మ (అంబిక) తమిళ సినిమాలో విజయ విహారం చేశారు. వారి స్థానాన్ని ఏ హీరోయిన్ భర్తీ చేయలేదు. వారి కాలంలో కొందరు హీరోయిన్లు మాత్రమే ఉండేవారు. సూపర్ స్టార్స్‌కు ఉండే ప్రజాదరణ అమ్మకు, పెద్దమ్మకు లభించింది. అభిమానులు అదే స్థాయిలో ఉండేవారు. ఇప్పటి పరిస్థితి వేరు. కొత్త హీరోయిన్లు చాలా మంది వస్తున్నారు.
 
 ప్ర : తమిళంలో కంటే ఇతర భాషా చిత్రాలలోనే నటించడానికి ఆసక్తి చూపుతున్నారటగా?
 జ : అది అసత్య ప్రచారం. నిజానికి నాకు తొలి అవకాశం టాలీవుడ్‌లోనే వచ్చింది. తమిళంలో కో చిత్రంలో నటించాను. ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు బృందావనం అనే చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాను. తమిళంలో డీల్ చిత్రంలో నటిస్తున్నాను. ఇతర చిత్రాల కంటే తమిళ చిత్రాలకే అధిక ప్రాముఖ్యం ఇస్తున్నాను.
 
 ప్ర : సరే తమిళంలో ఏ హీరోతో నటించాలని ఆశిస్తున్నారు?
 జ : అందరు హీరోలూ నచ్చిన వారే. ఖాళీ సమయాల్లో పాత సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తుంటాను. అవకాశాల కోసం వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు. మంచి అవకాశం వస్తే నటించడానికి రెడీ.
 
 ప్ర : ప్రముఖ దర్శకుల చిత్రాలలోనే నటిస్తారా?
 జ : ప్రముఖ దర్శకులు, నూతన దర్శకులు అనే తారతమ్యం చూపే మనస్తత్వం నాది కాదు. మంచి పాత్ర అనిపిస్తే ఏ దర్శకుడి చిత్రం అయినా చేస్తాను. డబ్బు కోసం వచ్చిన అవకాశాలన్నీ చేసెయ్యడానికి సిద్ధంగా లేను.

 ప్ర : అన్నకొడి చిత్ర షూటింగ్‌లో దర్శకుడి చేత చెంప దెబ్బ తిన్న అనుభవం ఉందా?
 జ : అదంతా పాత కాలంలో. ఇప్పుడు హీరో హీరోయిన్లు అలా లేరు. అన్నకొడి చిత్రంలో దర్శకుడు సన్నివేశాన్ని వివరించిన విధం ఎంతగానో నచ్చింది. అప్పటి భారతీరాజా ఇప్పుడు లేరు. చాలా మారిపోయారు. చిన్న కుర్రాడిలా మారి జాలీగా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తున్నారు.
 
 ప్ర : భవిష్యత్ ఆశలు, ఆశయాలు ఏమైనా ఉన్నాయా?
 జ : ఆశ ఏదైనా ఉంటే అమ్మ నెరవేర్చుతుంది. ప్రత్యేక అమ్మాయిగా కాకుండా సాధారణ యువతిగా జీవించడం ఇష్టం. షూటింగ్ లేకుంటే కేరళలో ఉన్న మా ఇంటికి వెళుతుంటాను. అక్కడ గడపడం మనసుకు సంతోషంగా ఉంటుంది.