ఆ హీరోయిన్లకు డబ్బే డబ్బు

24 Feb, 2016 18:43 IST|Sakshi
ఆ హీరోయిన్లకు డబ్బే డబ్బు

ఎవరైనా మంచి ఉద్యోగం చేస్తుంటేనో, మంచి హోదాలో ఉంటేనో ఆయనకేమిటి రెండు చేతులా సంపాదిస్తున్నారు అంటుంటారు. అలాగే మన హీరోయిన్లు రెండు చేతులా సంపాదిస్తూ కోట్లు కూడబెడుతున్నారు. ఒక పక్క సినిమాల్లో కోట్లు గడిస్తూనే మరో పక్క లాభదాయకమైన వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ ధనార్జనకు ఉపక్రమించడం గమనార్హం. సాధారణంగా సినిమా వాళ్లు తమకు సినిమా మినహా ఏ పని తెలియదంటుండడం వింటుంటాం.
 
 నిజానికి ఆ రంగంలోని చాలా మందికి ఆ మాటలు వర్తించవు. ఇక కథానాయికల విషయాన్నే తీసుకుంటే వృత్తి పరంగా వారి మధ్య గట్టి పోటీనే నెలకొందని చెప్పవచ్చు. ఇప్పుడు ఏడాదికి 150 మందికి పైగా నూతన హీరోయిన్లు దిగుమతి అవుతున్నారు. వారిలో అదృష్టం తలుపు తట్టని కొందరిని మినహాయిస్తే చాలా మందికి అవకాశాలు లభిస్తూనే ఉన్నాయి.
 
ఏదేమైనా ప్రస్తుతం ప్రముఖ కథానాయికలుగా చెలామణి అవుతున్న పలువురు హీరోయిన్లు తమ సంపాదనను ఇతర రంగాల్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. రియల్‌ఎస్టేట్, హోటళ్లు, నగల దుకాణాలు ఇలా రకరకాల లాభసాటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు. దీన్ని ముందు చూపు అనుకుంటారో, జాగ్రత్త అనుకుంటారో, లేక డబ్బెవరికి చేదు అనుకుంటారో మీ ఇష్టం. అలా రెండు చేతులతో సంపాదిస్తున్న కొద్ది మంది నటీమణుల వివరాలను చూద్దాం.
 
రియల్ ఎస్టేట్
 ఇక మరో సంచలన నటి త్రిష కూడా చాలా కాలంగా హోటల్ వ్యాపారంతో పాటు రియల్‌ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తున్నారు. ఆమె కొన్న ఆస్తులు విలువ ఇప్పుడు పలు రెట్లు పెరిగిపోయింది.త్రిషకు హైదరాబాద్‌లో ఒక హోటల్ కూడా ఉందన్నది గమనార్హం.
 
అనుష్కది అదే బాట
 ప్రస్తుతం అధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్లలో నటి అనుష్క ఒకరు. ఈ యోగా సుందరి రియల్‌ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేస్తున్నారు. బెంగళూర్‌లో రియల్‌ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు.అక్కడ ఇక ఫామ్‌హౌస్ కూడా కొనుగోలు చేశారు.
 
  బంగారాన్ని నమ్ముకున్న నటి
 బాహుబలి చిత్రంతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ప్రస్తుతం ఉజ్వలంగా ప్రకాశిస్తున్న నటి తమన్నా. ఈ మిల్కీబ్యూటీ తన తండ్రి నగల దుకాణ వ్యాపారాన్ని మరింత పెంచే పనిలో నిమగ్నమయ్యారు. కాళీ సమయాల్లో కొత్త కొత్త డిజైన్లను తయారు చేసి ఆ బంగారు ఆభరణాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తూ అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు.

 
స్థలాలపై పెట్టుబడులు
 కోలీవుడ్‌లో నంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సంచలన తార నయనతార. ప్రస్తుతం ఈ కేరళ బ్యూటీ రెండున్నర నుంచి మూడు కోట్లు పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది.అయినా ఇక్కడి సంపాదనను పలు రెట్లు పెంచుకునే విధంగా నయనతార స్థలం ఎక్కడ అమ్మకానికి ఉంటే అక్కడ వాలి కొనేస్తున్నారట. అలా చెన్నై, హైదరాబాద్, బెంగళూర్‌లలో ఎకరాల కొద్దీ కొనుగోలు చేస్తున్నారు. ఆ మధ్య కేరళలో ఒక పెద్ద ఫామ్ హౌస్‌ను కొనేశారు.
 
 పెళ్లిళ్లతో ఆదాయం
 ఇటు దక్షిణాదితో పాటు అటు ఉత్తరాదిలోనూ నటిస్తూ, మరో పక్క వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ముప్పేట గడిస్తున్న నటి తాప్సీ మరో విధంగానూ ఆదాయాన్ని పొందుతున్నారు. తన స్నేహితులతో కలిసి పెళ్లిళ్ల కంపెనీని ప్రారంభించి కాంట్రాక్ట్ పద్ధతిలో జామ్‌జమ్ అంటూ పెళ్లిళ్లు చేయిస్తూ సంపాదింస్తున్నారు.

ఈ వ్యాపారంలో పెళ్లికూతురు,పెళ్లికొడుకు వారి బంధువులు పెళ్లి మండపానికి వస్తే చాలు. వాళ్లను ముస్తాబు చేయడం నుంచి పెళ్లి తతంగం పూర్తి అయ్యే వరకూ అన్ని విషయాలను తాప్సీ కంపెనీయే చూసుకుంటుంది. ఈ సంస్కృతి ఇప్పుడు అధికం అవుతోంది. ఇక నటి హన్సిక నటిగా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు.
 
అయితే అందులో కొంత శాతం తాను దత్తత తీసుకున్న బాలల కోసం వెచ్చిస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. ముంబైలో ఇప్పటికే స్థలం కొని ఆశ్రమం కట్టించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా నటి ప్రణిత ఇటీవలే బెంగళూర్‌లో ఒక హోటల్‌కు భాగస్వామి అయ్యారు. త్వరలోనే దాని శాఖలను హైదరాబాద్, చెన్నైలకు విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. నటి కాజల్‌ అగర్వాల్ రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. నటి కుష్బు ఒక పక్క రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తూనే, అడపాదడపా సినిమాలో నటిస్తూ మరో పక్క చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభించి నిర్మాతగా ఆదాయం గడిస్తున్నారు. నటి సిమ్రాన్ కూడా చిత్ర నిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తున్నారు.