మహేశ్, కొరటాలకు మరో నెల ఊరట

10 Mar, 2017 02:50 IST|Sakshi
మహేశ్, కొరటాలకు మరో నెల ఊరట

వ్యక్తిగత హాజరు విషయంలో హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్‌: శ్రీమంతుడు సినిమా కాపీరైట్‌ వివాదానికి సంబంధించి కింది కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యే విషయంలో హీరో మహేశ్‌బాబు, దర్శకుడు కొరటాల శివకు మినహాయింపునిస్తూ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు మరో నెల రోజులు పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అంబటి శంకరనారాయణ గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడు సినిమా నిర్మించారని, తన అనుమతి లేకుండా తన నవల ఆధారంగా సినిమా నిర్మించడం కాపీ రైట్‌ ఉల్లంఘనే అవుతుందంటూ ఆర్‌.డి.విల్సన్‌ అలియాస్‌ శరత్‌చంద్ర నాంపల్లి కోర్టులో కేసు దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్‌జే కోర్టు మహేశ్‌బాబు, కొరటాల శివలకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వీరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, మహేశ్‌బాబు, కొరటాల శివలకు కింది కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా గురువారం ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి మరోసారి విచారణ జరిపారు. ఫిర్యాదుదారు శరత్‌చంద్రకు నోటీసులు అందాల్సి ఉందని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి... తాజా ఉత్తర్వులిచ్చారు.