‘జరిగిందేదో జరిగిపోయింది..గతాన్ని మార్చలేను’

24 Sep, 2019 18:44 IST|Sakshi

తన మాజీ ప్రేయసి నేహా కక్కర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు బాలీవుడ్‌ నటుడు హిమాంశ్‌ కోహ్లి పేర్కొన్నాడు. విడిపోయిన తర్వాత కూడా ఆమెపై ఏమాత్రం గౌరవం తగ్గలేదని... తనను ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉంటానన్నాడు. నేహా వంటి గొప్ప ఆర్టిస్టుతో వేదికను పంచుకోవడం ఎవరికైనా ఆనందంగానే ఉంటుందని ప్రశంసలు కురిపించాడు. సింగింగ్‌ ప్రోగ్రామ్‌ ‘ఇండియన్‌ ఐడల్‌’ ద్వారా వెలుగులోకి వచ్చిన నేహా కక్కర్‌.. తర్వాతి సీజన్‌లో అదే కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. కాలా చష్మా, దిల్‌బర్‌ రీమిక్స్‌ వంటి పలు బాలీవుడ్‌ హిట్‌ సాంగ్స్‌ ఆలపించిన నేహా.. నటుడు హిమాంశు కోహ్లితో ప్రేమలో ఉన్నట్టు ఇండియన్‌ ఐడల్‌ వేదికపై ప్రకటించారు. అయితే కొంతకాలంగా వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో తన సోషల్‌ మీడియా అకౌంట్లలో హిమాంశును అన్‌ఫాలో చేసిన నేహా.. తాను డిప్రెషన్‌లో ఉన్నానంటూ వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె అభిమానులు హిమాంశును టార్గెట్‌ చేస్తూ విపరీతంగా ట్రోల్‌ చేశారు. అయితే నేహా మాత్రం తన పరిస్థితికి తానే కారణమని.. ఎవరినీ నిందించవద్దని వారికి విఙ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హిమాంశు...‘ నాకు నేహపై ఎటువంటి కోపం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. గతాన్ని నేను మార్చలేను. అయితే ఒక విషయం.. నేను ఎల్లప్పుడూ నేహాను గౌరవిస్తూనే ఉంటాను. మేము గొడవ పడిన రోజుల్లో కూడా ఒకరినొకరం గౌరవించుకోవడం మానలేదు. తను అద్భుతమైన వ్యక్తిత్వం కలది. అంతకుమించి గొప్ప కళాకారిణి. తనకు ఆ దేవుడు అన్ని సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించి తను తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నాడు. అదే విధంగా తమ హిట్‌ సాంగ్‌...‘ఓహ్‌ హమ్ సఫర్‌’ గురించి చెబుతూ.. మేము రూపొందించిన ఈ సాంగ్‌ మిలియన్ల కొద్దీ వ్యూస్‌ సాధించింది. విడిపోయినంత మాత్రాన తనతో కలిసి పనిచేయకూడదని అనుకోను. మంచి ప్రాజెక్టు వస్తే ఇద్దరం కలిసి పనిచేస్తాం. ప్రస్తుతం నా జీవితంలో ప్రేమ, పెళ్లికి చోటులేదు. వాటి గురించి ఆలోచించడం లేదు. కేవలం నటన మీదే దృష్టి సారించాను అని వ్యాఖ్యానించాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా