ఎస్‌–13కి యువ సంగీత దర్శకుడు

7 Aug, 2018 10:43 IST|Sakshi

తమిళసినిమా: సినిమాకు కథ తరువాత సంగీతం అంత బలంగా మారిందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా పాటలు హిట్‌ అయితే సినిమా సగం హిట్‌ అయినట్టే. అందుకే సంగీతానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇకపోతే వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ నటుడు శివకార్తీకేయన్‌ సీమరాజా చిత్రాన్ని పూర్తి చేసి తాజా చిత్రానికి రెడీ అయ్యారు. ఇది ఆయన 13వ చిత్రం. అందుకే ఎస్‌కే– 13గా పేరుతో ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్‌ పతాకంపై నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. రాజేశ్‌ ఎం దర్శకత్వం విహిస్తున్న చిత్రంలో అగ్రనటి నయనతార నాయకిగా నటిస్తున్నారు. వేలైక్కారన్‌ వంటి విజయవంతమై చిత్రం తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న రెండవ చిత్రం ఇది.

కాగా ఇప్పుటికే చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రానికి నటీనటులతో పాటు సాంకేతిక వర్గం ఎంపిక పూర్తైంది. సంగీత దర్శకుడిగా హిప్‌ హాప్‌ తమిళ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌రాజా మాట్లాడుతూ ఈ తరం యువ నాడి తెలిసిన సంగీత దర్శకుడిని ఎంపిక చేయాలన్న విషయంలో స్పష్టంగా ఉన్నామన్నారు. అందుకే హిప్‌ హాప్‌ తమిళాను ఎంపిక చేశామని చెప్పారు. హీరో, దర్శకత్వం, సంగీతం అంటూ బిజీగా ఉన్న ఆయన తమ చిత్రానికి సమయాన్ని కేటాయిస్తారా? అన్న సంశయంతోనే ఆయన్ని సంప్రదించామన్నారు. అయితే కథ విన్న వెంటనే హిప్‌ హాప్‌ తమిళా సంగీతాన్ని అంగీకరించారని తెలిపారు. శివకార్తీకేయన్, నయనతార జంటను కుటుంబ సమేతంగా చిత్రం చూసే ప్రేక్షకులు అధికం అన్నారు. వారికి హిప్‌హాప్‌ తమిళా జోడైతే చిత్ర విజయం తథ్యమన్నారు. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచే దర్శకుడు రాజేశ్‌ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో జనరంజక చిత్రం అవుతుందని కచ్చితంగా చెప్పగలనని నిర్మాత పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు