ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తాను

2 Jun, 2019 00:47 IST|Sakshi
జజ్బా సింగ్, నివాస్‌ టీఎన్‌ కృష్ణ, కలైపులి యస్‌. థాను, కార్తికేయ, దిగంగన సూర్యవన్షీ, జేడీ చక్రవర్తి, అనంత్‌ శ్రీరామ్‌

– కార్తికేయ

‘‘హీరో అయితే చాలు. నా సినిమాను కొంత మంది చూస్తే చాలు అనుకునేవాడిని. హీరో కావాలని చిన్నప్పట్నుంచి కలలు కన్నాను. అసలు హీరోలు ఎలా ఉంటారబ్బా? మామూలు వాళ్లు ఉన్నట్లే వాళ్లూ ఉంటారా? అనిపించేది. కానీ సడెన్‌గా నన్ను హీరో అంటుంటే.. మామూలు మనిషిలానే అనుకున్నాను. నేను ఇంత కష్టపడితే ఎంతో ఇచ్చారు. మీ (ప్రేక్షకులు)  ప్రేమను చూశాను. అందుకనే ఇకపై ముందుకే వెళతాను’’ అని కార్తికేయ అన్నారు.  టీఎన్‌ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగంగనా సూర్యవన్షీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హిప్పీ’. కలైపులి థాను నిర్మించారు.

జూన్‌ 6న రిలీజ్‌ కానున్న ఈ చిత్రం ప్రీ–రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్‌ టి.ఎన్‌.కృష్ణ  మాట్లాడుతూ –‘‘నేను ‘హిప్పీ’ సినిమాను కార్తికేయతో చేయడానికి ప్రధాన కారణం తన కళ్లే. పవర్‌ఫుల్‌గా ఉండే తన కళ్లను చూసే తనతో సినిమా చేయాలనుకున్నాను. కచ్చితంగా తను రాకింగ్‌ హీరో అవుతాడు. ఇందులో జేడీగారు చాలా ఇంట్రస్టింగ్‌ క్యారెక్టర్‌ చేశారు. దిగంగన నేచుల్‌ యాక్టర్‌. నివాస్‌ సోల్‌ ఉన్న మ్యూజిక్‌ను అందించారు. థానుగారు లేకుంటే ఈ సినిమా ఉండేది కాదు’’ అన్నారు. ‘‘హిప్పీ అంటే సంచార జీవి అని అర్థం.

ఈ సినిమాలో నా చేత అన్ని రకాల పాటలు రాయించారు. నా మీద అన్ని కోణాల్లోనూ నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు’’ అన్నారు అనంత్‌ శ్రీరామ్‌. ‘‘థానుగారు దర్శకుడిగా సాధకబాధకాలు తెలుసుకున్న తర్వాత నిర్మాతగా మారారు.  నా జీవితంలో రామ్‌గోపాల్‌ వర్మ అనే రాముడున్నాడు. ఆయన కృష్ణలీలలకు ఫేమస్‌. టీఎన్‌ కృష్ణగారు రామ తత్వానికి ఫేమస్‌. కెమెరా ముందు తప్ప.. కార్తికేయకు కెమెరా వెనక యాక్టింగ్‌ చేయడం రాదు. తనతో వర్క్‌ చేయడాన్ని ఎంజాయ్‌ చేశాను’’ అన్నారు జేడీ చక్రవర్తి. ‘‘జూలై 12, 2018.. నేను మళ్లీ పుట్టినరోజు. నాకు పునర్జన్మ దక్కిన రోజు. ఆ రోజు ‘ఆర్‌ఎక్స్‌ 100’ విడుదలైంది. ఆ సినిమా లేకపోతే నేను లేను. కాబట్టి ఎన్ని సినిమాలు చేసినా నా తొలి సినిమా గురించి మాట్లాడుతాను. ఒళ్లు దగ్గర పెట్టుని పనిచేస్తాను.

‘హిప్పీ’ విషయంలో నేను ఇంత కాన్ఫిడెంట్‌గా ఉండటానికి కారణం డైరెక్టర్‌ కృష్ణగారే. ఆయన తమిళ డైరెక్టర్‌ కాదు.. పక్కా మాస్‌ తెలుగు డైరెక్టర్‌. థానుగారు ఫోన్‌ చేసినప్పుడు అంత పెద్ద ప్రొడ్యూసర్‌ నాకెందుకు ఫోన్‌ చేస్తారనుకున్నాను. స్కిప్ట్ర్‌ నచ్చింది.. చెన్నై రండి అన్నారాయన. వెళితే అడ్వాన్స్‌ చెక్‌ ఇచ్చారు. రజనీకాంత్‌ వంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసిన పెద్ద నిర్మాత నాతో సినిమా చేయా లనుకోవడంతో షాక్‌ అయ్యాను. జేడీగారి ఎనర్జీ లెవల్స్‌ సూపర్బ్‌. జూన్‌ 6న నేను ఒక్కడినే కాదు.. మీరు కూడా షర్ట్‌ తిప్పి ఎగరేస్తారు. ఆ రోజు అందరం హిప్పీలుగా మారుతాం. సినిమా మీకు నచ్చితే షర్ట్‌ తిప్పి పైకి ఎగరేసి ఫొటో తీయండి. దాన్ని ట్రెండ్‌ చేద్దాం’’ అన్నారు.

మరిన్ని వార్తలు