రణ్‌వీర్‌సింగ్ అంటే దీపికకు ఎంతిష్టమో...

19 Aug, 2014 23:25 IST|Sakshi
రణ్‌వీర్‌సింగ్ అంటే దీపికకు ఎంతిష్టమో...

అతనలా ప్రవర్తిస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది!
 
నిజమైన ప్రేమంటే... ప్రేమించిన వారి లోపాలను కూడా ఇష్టపడటం. ప్రస్తుతం దీపికా పదుకొనే అదే చేస్తున్నారు. రణ్‌వీర్‌సింగ్ అంటే దీపికకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. రణ్‌వీర్ ప్రస్తావన తీసుకొస్తే చాలు... పులకించిపోతారీ పొడుగుకాళ్ల సుందరి. రణ్‌వీర్ గురించి ఎంత సేపు మాట్లాడటానికైనా ఇష్టపడతారు. ఇటీవలే రణ్‌వీర్ లోపాల గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా మాట్లాడారు. ‘‘రణ్‌వీర్ ‘అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్’తో బాధ పడుతున్నాడు. ఊరకే భయపడటం, సౌకర్యంగా ఉండలేకపోవడం, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయడం, అనవసరపు ఆత్రుత ప్రదర్శించడం... ఆ వ్యాధి లక్షణాలు. ఇవన్నీ రణ్‌వీర్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి.
 
నీట్‌గా ఉన్న దాన్ని మళ్లీ మళ్లీ శుభ్రం చేసుకోవడం, మళ్లీ మళ్లీ చెకింగ్ చేసుకోవడం, తొందరపడిపోవడం, అతిగా ప్రేమించడం, శృంగారం విషయంలో అడ్వాన్స్ అయిపోవడం... ఇవి కూడా ఆ వ్యాధి లక్షణాలే. ఇవన్నీ రణవీర్‌కి ఉన్నాయి. లొకేషన్‌లో రణ్‌వీర్ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. షాట్ గ్యాప్‌లో పెర్‌ఫ్యూమ్ కొట్టుకుంటుంటాడు. నిమిషనిమిషానికీ దువ్వెనతో దువ్వుకుంటుంటాడు. చూయింగ్‌గమ్ విపరీతంగా నమలుతుంటాడు. ఇవన్నీ తాను ఎందుకు చేస్తున్నాడో నాకు తెలుసు.
 
తన సమస్య పక్కవారికి తెలీకూడదని తాను చేసే ప్రయత్నాలు అవన్నీ. తాను అలా చేయడం మిగిలినవారికి చెడ్డగా అనిపిస్తుందేమో కానీ... నాకు మాత్రం ఇష్టంగా ఉంటుంది. అతనలా ప్రవర్తిస్తుంటే గమ్మత్తుగా అనిపిస్తుంది. తన వంక తదేకంగా చూడాలనిపిస్తుంది. రణ్‌వీర్ నాకు అమాయకుడిలా కనిపిస్తాడు. ఇంకా అతనిలో నాకు నచ్చే సుగుణాలు చాలానే ఉన్నాయి. రణ్‌వీర్ నా జీవితానికి నిజంగా ప్రత్యేకం’’ అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ చెప్పుకొచ్చారు దీపిక.