ఫాదర్స్ డే: వాళ్లకు మాత్రం 'మదర్స్ డే'!

20 Jun, 2017 07:27 IST|Sakshi
ఫాదర్స్ డే: వాళ్లకు మాత్రం 'మదర్స్ డే'!

లాస్ ఏంజెలిస్: భార్య ఏంజెలినా జోలీతో విడాకులు తీసుకున్న తర్వాత హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ ఒంటరి వాడయ్యాడు. ఎంతలా చివరికి 'ఫాదర్స్ డే' రోజు కూడా తన పిల్లలకు చేరువ కానట్లుగా ఈ హీరో పరిస్థితి తయారైంది. గత ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా.. తమ తండ్రితో అనుబంధాన్ని సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా లేకుండా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు. నటి, బ్రాడ్ పిట్ మాజీ భార్య ఏంజెలినా జోలీ మాత్రం తన ఇష్ట రీతిన ప్రవర్తించింది. గతేడాది వీరి విడాకుల సమయంలో పిల్లల్ని ఆయన ఎప్పుడైనా కలుసుకునే హక్కు ఉందని చెప్పిన జోలి.. ఈ ఫాదర్స్ డే రోజు తన ఆరుగురు పిల్లలతో కలిసి సరదాగా టూర్‌కు వెళ్లింది.

లాస్ ఏంజెలిస్ విమానాశ్రయంలో శనివారం రాత్రి తన పిల్లలు మాడెక్స్ జోలీ-పిట్(15), పాక్స్ థియన్ జోలీ-పిట్(13), జహారా మార్లే జోలీ-పిట్(12), షిలోహ్ జోలీ-పిట్(11), కవలలు కెనాక్స్ జోలీ-పిట్, వివీన్నె జోలీ-పిట్(8) లతో దర్శనమిచ్చింది ఏంజెలినా జోలీ. ఇటీవల కొనుగోలు చేసిన కొత్త ఇంట్లో ఉంటున్న జోలీ.. మాజీ భర్తకు పిల్లల్ని దూరం చేసిందన్న వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఈ క్రమంలో ఫాదర్స్ డే రోజు బ్రాడ్ పిట్‌ను తమ పిల్లలకు దూరంగా ఉంచడంలో భాగంగా టూర్ ప్లాన్ చేసింది. మీడియాతో మాట్లాడేందుకు కూడా ఆమె నిరాకరిస్తూ తన దారిన వెళ్లిపోయినట్లు సమాచారం.


ప్రపంచ వ్యాప్తంగా 'ఫాదర్స్ డే' జరుపుకుంటుంటే.. బ్రాడ్ పిట్ కు అందుబాటులో లేని పిల్లలు తల్లి ఏంజెలినాతో కలిసి 'మదర్స్ డే' జరుపుకున్నారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఫాదర్స్ డే రోజు లాస్ ఫెలిజ్ లోని తన పాతింట్లో బ్రాడ్ పిట్  ఒక్కడే బాధతో గడిపాడని తెలుస్తోంది. భర్తతో విడిపోయిన జోలీ నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు ఇటీవల హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ కారణంగానే పిల్లలను మాజీ భర్తకు ఆమె దూరం చేస్తుందని.. వారికి తండ్రి ప్రేమ కరువైందని జోలీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా