రజనీకాంత్ కోసం డాన్స్ చేసిన షారుక్, దీపికా!

22 Jul, 2013 05:09 IST|Sakshi
రజనీకాంత్ కోసం డాన్స్ చేసిన షారుక్, దీపికా!
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్టార్ కోసం గాయకుడు, సంగీతదర్శకుడు హనీసింగ్ ఓ పాట తయారు చేస్తున్నారు. ఈ పాటను రజనీకి అంకితం ఇవ్వాలన్నది ఆయన ఆశయం. అయితే ఈ పాటకు బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ కాలు కదిపితే బాగుంటుందని హనీ అనుకున్నారు. 
 
 ఈ విషయమై ఇటీవల షారుక్‌ని టీ సీరీస్ ఛైర్మన్ భూషణ్‌కుమార్, హనీసింగ్ కలిశారు. ఆగస్ట్ 9న విడుదల కానున్న తన ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ పాటలో నర్తించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు షారుక్. ఓ సూపర్‌స్టార్‌కి అంకితం ఇచ్చే పాటలో మరో సూపర్‌స్టార్ నర్తించడం అంటే చిన్న విషయం కాదు.
 
  షారుక్‌కి ఎంత అభిమానం ఉంటే అంగీకరించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. అది మాత్రమే కాదు.. తనతో పాటు దీపికా పదుకొనేని కూడా ఈ పాటకు కాలు కదపమని కోరారట షారుక్. దీపికా కూడా రజనీకి అభిమాని కావడంతో ఆమె కూడా అంగీకరించింది. ఈ పాట ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ థీమ్‌కి దగ్గరగా ఉంటుందని, రజనీ స్టయిల్‌లో సాగుతుందని షారుక్ తెలిపారు. ఈ పాటను స్వరపర్చడంతో పాటు సాహిత్యం అందించి, పాడారు హనీసింగ్.