ఆస్కార్‌ నుంచి ఆహ్వానం 

2 Jul, 2020 13:04 IST|Sakshi

‘‘బంధువులు ఉన్నవారికి బాలీవుడ్‌లో రెడ్‌ కార్పెట్‌ దొరుకుతుంది’’ అని ఏ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి, నిరూపించుకున్న హీరోయిన్లు కంగనా రనౌత్, తాప్సీ, దర్శకుడు అభినవ్‌ కశ్యప్‌ వంటి వారు బాహాటంగానే విమర్శిస్తున్నారు. బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌ కూడా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తుందని దర్శఖ–నిర్మాత–రచయిత హన్సల్‌ మెహతా చేసిన ఓ ట్వీట్‌ చెబుతోంది. ‘నెపోటిస్టిక్‌ అకాడమీ’ అని ఆయన బుధవారం ట్వీట్‌ చేశారు. దీనికి కారణం ఏంటంటే.. ఆస్కార్‌ అవార్డులను ప్రదానం చేసే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ సంస్థ భారతీయ సినిమాకి సంబంధించిన కొందరు ప్రముఖులకు ఆహ్వానం పంపింది. ప్రతి ఏడాదీ అవార్డుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా కొందరు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తుంది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌.

ఈ ఏడాది మొత్తం 819 మందిని ఆహ్వానించింది. భారతీయ సినిమా నుంచి హీరో హృతిక్‌ రోషన్, హీరోయిన్‌ ఆలియా భట్, డిజైనర్‌ నీతూ లుల్లా, దర్శకురాలు నందినీ శ్రీకెంట్, దర్శకురాలు నిషితా జైన్‌ తదితరులను ఆహ్వానించారు. బాలీవుడ్‌లో మంచి బ్యాక్‌గ్రౌండ్‌ ఉంది కాబట్టే  హృతిక్, ఆలియా వంటివాళ్లను ఆహ్వానించారని అర్థం వచ్చేట్లుగా హన్సల్‌ మెహతా ‘నెపోటిస్టిక్‌ అకాడమీ’ అని ట్వీట్‌ చేశారనే వార్తలు మొదలయ్యాయి. ‘‘నేను చేసిన ట్వీట్‌కి అర్థం తెలియకుండా నా ట్వీట్‌ గురించి మాట్లాడొద్దు’’ అని మరో ట్వీట్‌ చేశారు హన్సల్‌. తాను చేసిన  ‘నెపోటిస్టిక్‌ అకాడమీ’ ట్వీట్‌కి మాత్రం ఆయన అర్థం చెప్పలేదు.

మరిన్ని వార్తలు