చాన్నాళ్లకు కొత్త సిన్మా

12 Feb, 2016 22:35 IST|Sakshi
చాన్నాళ్లకు కొత్త సిన్మా

హృతిక్ రోషన్... ‘క్రిష్’, ‘ధూమ్’ సిరీస్‌ల ద్వారా చాలామందికి దగ్గరైన వెండితెర ‘జోధా అక్బర్’. కానీ, ఆయన వెండితెరపై కనిపించి ఏడాది పైనే అయిపోయింది. దాదాపు 17 ఏళ్ళ వైవాహిక బంధం విచ్ఛిన్నమై, విడాకులు తీసుకోవాల్సి రావడంతో హృతిక్ సహజంగానే దిగులు పడ్డారు. 2014 అక్టోబర్‌లో వచ్చిన యాక్షన్ కామెడీ చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’ తరువాత మళ్ళీ ప్రేక్షకుల ముందుకు ఆయన రానే లేదు. అయితే, ఇప్పుడు మళ్ళీ తెరపై పలకరించేందుకు సిద్ధమవుతున్నారు.

హీరోయిన్ యామీ గౌతమ్‌తో కలసి ‘కాబిల్’ అనే కొత్త చిత్రంలో నటిస్తున్నారు. హృతిక్ రోషన్ తండ్రీ, దర్శక - నిర్మాత రాకేశ్ రోషన్ ఈ చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఐశ్వర్యారాయ్ బచ్చన్‌ని మళ్ళీ తెరపైకి తెచ్చిన ‘జజ్బా’ చిత్ర దర్శకుడు సంజయ్ గుప్తాయే దీనికీ దర్శకుడు. ‘‘ ‘కాబిల్’ ద్వారా సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాం. నేను, యామీ గౌతమ్ జంటగా దుమ్ము రేపుతామని ఆశిస్తున్నా’’ అని హృతిక్ పేర్కొన్నారు. మొత్తానికి, కొత్త సినిమాతో మళ్ళీ నటజీవితంపై దృష్టి సారిస్తున్న హృతిక్‌కు ఆల్ ది బెస్ట్!