అందుకే సక్సెస్‌ మీట్‌  

19 Dec, 2018 01:01 IST|Sakshi

‘‘హుషారు’ సినిమా మంచి సక్సెస్‌ కావాలని ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో మాట్లాడాను. ఈ సినిమా విడుదలైన రోజు కంటే తరువాతి రోజు నుంచి వసూళ్లు పెరగడం సంతోషంగా ఉంది. ఇదంతా కేవలం ప్రేక్షకుల మౌత్‌ టాక్‌తోనే జరిగింది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మంచు, దినేష్‌ తేజ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమ ఇంగ్లే ముఖ్య తారలుగా శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘హుషారు’  చూసిన యూత్‌ అందరూ సినిమాని సపోర్ట్‌ చేద్దామని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం, మీడియా మంచి సపోర్ట్‌ ఇవ్వడంతో పాటు పాజిటివ్‌ రివ్యూలు రావడం వల్లే ఈ సినిమా ఇంత మంచి హిట్‌ అయింది.

రోజురోజుకి కలెక్షన్స్‌ పెరుగుతున్నాయి. చిన్న సినిమాలకు నా వంతు సహకారం అందివ్వాలనే ఉద్దేశంతోనే సక్సెస్‌మీట్‌ ఏర్పాటు చేశాం’’ అన్నారు. శ్రీకర్‌ గ్రూప్స్, శ్రీకర్‌ సీడ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లింగా శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ– ‘‘నా స్నేహితులు లక్ష్మీనారాయణ, బెక్కెం వేణుగోపాల్‌ల సలహా మేరకు ‘హుషారు’ సినిమా కథ విన్నా. నచ్చడంతో  కో–ప్రొడ్యూసర్‌గా వ్యవహరించా. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్‌ కావడంతో ‘శ్రీకర్‌ ప్రొడక్షన్స్‌’ అనే బ్యానర్‌ను నెలకొల్పుతున్నాం. త్వరలోనే మా బ్యానర్‌లో సినిమా తీయాలనుకుంటున్నాం’’ అన్నారు. తేజస్‌ కంచర్ల, తేజ్‌ కూరపాటి, ప్రియా వడ్లమాని, దక్షా నగార్కర్, నైజాం డిస్ట్రిబ్యూటర్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా