అది రాంగ్‌ స్టెప్‌

13 Dec, 2018 00:29 IST|Sakshi

‘‘ఫ్రెండ్‌షిప్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు రాలేదు. ఈ నేపథ్యంలోని ‘ఈ నగరానికి ఏమైంది’, హుషారు’ ఒకేసారి మొదలయ్యాయి. అయితే ఆ సినిమా రిలీజ్‌ అయింది. నలుగురు స్నేహితులు కలిసి చేసే సాహసాలే మా చిత్రం’’ అని తేజస్‌ కంచర్ల అన్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో తేజస్, దక్ష, అభినవ్, ప్రియా ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘హుషారు’. బెక్కెం వేణుగోపాల్, రియాజ్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానున్న సందర్భంగా హీరో తేజస్‌ చెప్పిన విశేషాలు. 

∙మాది సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న ఫ్యామిలీ కాదు. సినిమాలపై ఇంట్రెస్ట్‌తో ఇంజనీరింగ్‌ మధ్యలోనే ఆపేసి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలెట్టా. తేజాగారి ‘నీకు నాకు’లో హీరోగా అవకాశం ఫస్ట్‌ నాకే వచ్చింది. ‘అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేయి, నెక్ట్స్‌ సినిమాలో హీరోగా చేద్దువుగానీ’ అని తేజాగారు అన్నారు. ఆ సినిమా చేయడంవల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. 

∙నిర్మాత కేయస్‌ రామారావుగారు, మా నాన్న స్నేహితులు. దాంతో ప్రకాశ్‌రాజ్‌గారి ‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే విభిన్న కథలు ఎంచుకోవాలని ఫిక్స్‌ అయ్యాను. రెండో సినిమా ‘కేటుగాడు’ చేశాను. అది రాంగ్‌ స్టెప్‌ అని  అర్థం అయ్యింది. ‘హుషారు’ నా మూడో సినిమా. ఈ సినిమా మేకింగ్‌లో ఆలస్యం అయ్యింది. అయినా కూడా నిర్మాత వేణుగోపాల్‌గారు మాలో హుషారు నింపారు.

∙కాలేజ్‌ పూర్తయిన తర్వాత లైఫ్‌లో ఏం చేయాలి? అని ఆలోచిస్తున్న టైమ్‌లో మా ఫ్రెండ్‌కి క్యాన్సర్‌ వస్తుంది. అప్పుడు అతని స్నేహితులుగా మేం ఎలా రియాక్ట్‌ అయ్యాం? లైఫ్‌లో ఎలా ఎదిగాం? అన్నదే చిత్రకథ. ఇందులో నా రియల్‌ లైఫ్‌కు దగ్గరగా ఉండే ఆర్య అనే పాత్ర చేశా. ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారని నమ్ముతున్నా. ఇకపై లీడ్‌ క్యారెక్టర్స్‌ మాత్రమే చేద్దాం అనుకుంటున్నాను. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. పెద్ద బ్యానర్‌లో మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. 

మరిన్ని వార్తలు