గరుడ వేగ సినిమా ప్రదర్శించొద్దు

12 Apr, 2018 13:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ హీరో రాజశేఖర్‌ నటించిన ‘పీయస్‌వీ గరుడ వేగ’  చిత్రాన్ని ప్రదర్శించరాదని హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గరుడ వేగ సినిమాపై డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీకి చెందిన యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(యూసీఐ) అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌కు విచారించిన సివిల్‌ కోర్టు ఇకపై గరుడవేగ చిత్రాన్ని టీవీల్లో గానీ, యూట్యూబ్‌, సోషల్‌ మీడియాల్లో గానీ ప్రదర్శించరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించవద్దంటూ దర్శకనిర్మాలతో పాటు, యూట్యూబ్‌కు కోర్టు నోటీసులు పంపింది. 

అసలేం జరిగింది?
గరుడ వేగ సినిమా తమ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సిటీ సివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కోర్టు నాల్గవ జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.కిరణ్‌కుమార్‌ విచారణ చేపట్టారు. చిత్రం మొత్తం యురేనియం కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణం నేపథ్యంలో సాగిందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదించారు. సదరు సంస్థకు చెందిన యురేనియం ప్లాంట్‌ ఏపీలోని తుమ్మలపల్లిలో ఉందన్నారు. ఈ ప్లాంట్ నుంచి అక్రమంగా ప్లూటోనియం, థోరియం తరలించినట్టు.. ఈ స్కాంలో తుమ్మలపల్లి ఎమ్మెల్యే, హోంమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిత్వశాఖ అధికారులు, యురేనియం కార్పొరేషన్‌ ఛైర్మన్‌, ఉన్నతాధికారులు పాత్రధారులైనట్లు చిత్రీకరించి కించపరిచారని పిటిషనర్‌ న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ స్కాంను ఎన్‌ఐఏ అసిస్టెంట్‌ కమిషనర్‌ పాత్రధారుడిగా హీరో వెలికి తీసినట్టు చూపారని లాయర్‌ పేర్కొన్నారు.

అందువల్ల చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోరారు. దీంతో పిటిషనర్‌ వాదనలను పరిశీలించిన జడ్జి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు చిత్ర ప్రదర్శన, ప్రచార కార్యక్రమాలు, ప్రెస్‌మీట్‌లు వంటివి నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేశారు. చాలా కాలంగా సరైన హిట్‌కోసం ఎదురుచూస్తున్న రాజశేఖర్‌కు గతేడాది నవంబరులో వచ్చిన గరుడ వేగ మంచి విజయం అందించిన విషయం తెలిసిందే . సినిమా విడుదలైన ఆరు నెలల తర్వాత మధ్యంతర ఉత్తర్వులు రావడం గమనార్హం.

మరిన్ని వార్తలు