అనసూయపై అనుచిత పోస్టు

11 Feb, 2020 07:47 IST|Sakshi

ట్విట్టర్‌లో చూసి స్పందించిన సైబర్‌ కాప్స్‌

సాక్షి, హైదరాబాద్‌: మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఫిర్యాదుల కోసం ఎదురు చూడట్లేదు. సైబర్‌ స్పేస్‌లోనూ పోలీసింగ్‌ చేస్తున్న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ అధికారులు అందులో ఉన్న అంశాలను బట్టి స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. యాంకర్‌ అనసూయకు సంబంధించిన అనుచిత పోస్టు విషయంలో ఇది మరోసారి స్పష్టమైంది. ట్విట్టర్‌లో యాక్ట్రసెస్‌ మసాలా పేరుతో ఓ గుర్తుతెలియని వ్యక్తి జనవరి 31న ఖాతా తెరిచాడు. ఇందులో యాంకర్‌ అనసూయతో పాటు సినీనటి అనుష్క తదితరుల ఫొటోలు వినియోగిస్తూ అనుచిత, అశ్లీల వ్యాఖ్యలు జోడించాడు. ఈ విషయాన్ని అనసూయ ఫాలోవర్‌గా ఉన్న సాయి రాజేష్‌ అనే వ్యక్తి ఆమెతో పాటు మరికొందరికీ ట్యాగ్‌ చేశాడు. దీన్ని గమనించిన అనసూయ ట్విట్టర్‌ వేదికగానే స్పందించారు. ట్విటర్‌ సపోర్ట్‌ టీమ్‌ను ఉద్దేశించి తమ నిబంధనలు మార్చుకోవాలని, ఈ తరహా పోస్టుల్నీ ఉపేక్షించవద్దంటూ సూచించారు. దీనికి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల్నీ అనసూయ ట్యాగ్‌ చేశారు.

దీన్ని చూసి తక్షణం స్పందించిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. గుర్తుతెలియని వ్యక్తి ఆ ఖాతాని కేవలం ఇలాంటి వ్యాఖ్యల కోసమే ఓపెన్‌ చేసినట్లు, ఇప్పటికి మూడు పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. తక్షణం ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసిన అధికారులు ఆ పోస్టులు తొలగించే చర్యలు తీసుకున్నారు. ఈ విషయంపై సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ... ‘ట్విట్టర్‌ ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యం కాదు. అనసూయ నుంచి లిఖితపూర్వకంగా ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇటీవల కాలంలో పలువురు నటీమణులు, సెలబ్రెటీలపై ఇలాంటి పోస్టులు వస్తున్నాయి. వీటిని ఉపేక్షించవద్దని కోరుతున్నాం. వారు నేరుగా సైబర్‌ క్రైమ్‌ ఠాణాకు రాలేకపోయినా తమ ఫిర్యాదుల్ని ఎవరి ద్వారా అయినా పంపితే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల స్పందనకు అనసూయ ట్విట్టర్‌ ద్వారానే ధన్యవాదాలు తెలిపారు.  
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా