నేను అమాయకురాల్ని!

30 Aug, 2015 09:06 IST|Sakshi
నేను అమాయకురాల్ని!

కొంచెం అల్లరిపిల్లలా, కొంచెం అమాయకంగా, ఇంకొంచెం గారంగా... ఇలా లావణ్యా త్రిపాఠీలో బోల్డన్ని షేడ్స్ ఉంటాయి. అన్ని షేడ్స్‌నీ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించగల సత్తా ఉంది కాబట్టే, తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తోనే తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారామె. నాని సరసన లావణ్య నటించిన ‘భలే భలే మగాడివోయ్’ వచ్చే నెల 4న విడుదల కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో యువీ క్రియేషన్స్, జీఏ2 సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మారుతి దర్శకుడు. బన్నీ వాసు నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలతో పాటు ఇతర విషయాలను కూడా లావణ్య ఈ విధంగా పంచుకున్నారు.
 
►నా రియల్ లైఫ్‌కి కొంచెం భిన్నంగా ఉన్న పాత్రను ‘భలే భలే మగాడివోయ్’లో చేశాను. ఇందులో నేను అమాయకురాల్ని. మంచి కూచిపూడి డ్యాన్సర్‌ని. నా చిన్నప్పుడే కూచిపూడి నేర్చుకోవడం ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. చిత్రీకరణ సమయంలో రోజుకి అరగంట ప్రాక్టీస్ చేసేదాన్ని. సినిమాలో నన్ను చూసి, భలే భలే అమ్మాయి అనుకుంటారు. ఓవరాల్‌గా అందరికీ బాగా నచ్చుతాను.

►‘ఈగ’ సినిమాలో నాని క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. ఆ సినిమాలో నాని కనిపించేది కాసేపే అయినా గుర్తుండిపోతాడు. దానికి కారణం తన నటనే. నాని సరసన ఓ సినిమాకి అవకాశం వస్తే బాగుండు అనుకున్నాను. ‘భలే భలే మగాడివోయ్’తో కుదిరింది. ఇప్పుడు సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్త హీరోలా నాని ప్రతి సీన్‌నీ చాలా ఎగ్జయిటింగ్‌గా చేస్తాడు.

►నేను టామ్‌బాయ్ టైప్. అందుకని మారుతిగారు నన్ను ‘తమ్ముడూ’ అని పిలుస్తుంటారు. ఆయన అలా పిలిచినప్పుడల్లా లొకేషన్లో అందరూ నవ్వుకునేవాళ్లు. ఆ పిలుపును నేనూ ఎంజాయ్ చేసేదాన్ని.

►‘అందాల రాక్షసి’లో నేను చేసిన మిథున పాత్ర కొంత ప్లస్, కొంత మైనస్ అయ్యింది. ఆ చిత్రంలో హోమ్లీగా కనిపించడంతో నన్ను గ్లామరస్‌గా ఊహించుకోలేపోతున్నారు. ఆ హోమ్లీ ఇమేజ్‌కి భిన్నంగా కూడా కనిపించగలనని నిరూపించు కుంటా.