చిరంజీవికి పెద్ద ఫాన్ అయ్యాను

8 Feb, 2014 10:51 IST|Sakshi
చిరంజీవికి పెద్ద ఫాన్ అయ్యాను

వేములవాడ : 'నవ్వించటం నా జీవనోపాధి... అంతకు మించి నేను మనసారా నవ్వుకునేంతటి సందర్భమెప్పుడూ రాలేదు. బతుకంతా ఎదురీతగానే సాగింది. ఇంకా నిత్యవిద్యార్థిగా బతకుపాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను' అంటారు సినీ హాస్యనటుడు శివారెడ్డి. తనది కరీంనగర్ జిల్లా అని చెప్పుకునేందుకు గర్వంగా ఉందంటారు. వారి మూడో కూతురుకు రాజన్న ఆశీర్వాదం పొందేందుకు వేములవాడ విచ్చేశారు.

బాల్యం కష్టాల కడలి....
మాది రామగుండం స్వస్థలం. మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడే నాన్న పోయారు. అమ్మే అన్ని తానే సాధింది. మేము అయిదుగురం అన్నదమ్ములం, ఇద్దరు అక్కయ్యలు. అందరం స్థిరపడ్డాం. బాల్యమంతా కష్టాల కడలే. ఏటా బద్దిపోచమ్మ తల్లికి బోనాలూ సమర్పించుకుంటాం. నాన్న పోయక ఇల్లు గడవని పరిస్థితి. ఇంట్లోని పాత్రలు సైతం అమ్ముకోవాల్సి వచ్చింది. ఏ బల్లా మీదనైతే నాన్న చనిపోయాడో దానిని సైతం అమ్ముకునేంత దారిద్ర్యం వెంటాడింది. కన్నీళ్లు రాని రోజంటూ లేదు. ఏదోలా రోజు గడిచేది. అదొక్కటే జీవితం కాదు కాబట్టి ....ఏ అవసరం తీరాలన్నా డబ్బు కావాలి.

వేదమంత్రాల ఇమిటేషన్ తో మొదలు...
జంతువుల అరుపులు అనుసరించడంతో మిమిక్రి మొదలయింది. చిన్నప్పుడు నాన్నతో గుడికి వెళ్లినప్పుడు అయ్యవారు మంత్రలు చదివే విధానాన్ని గమనించేవాడిని. అచ్చు ఆయనలాగే చదివేవాడిని. మాదాల రంగారావుగారి సినిమాలోని 'జజ్జనకరి జనారే' పాటకు పెండ్లి భరాత్లల్ల డాన్స్ చేసేటోన్ని. టీవీలో ఎన్టీఆయర్, ఏఎన్నార్, కృష్ణా డైలాగ్లను చూసి ఇమిటేట్ చేసేవాడిని. ఆతర్వాత చిరంజీవికి పెద్ద ఫానయ్యాను. ప్రత్యేకంగా మిమిక్రీలో గురువంటూ ఎవరూ లేరు.

ఇన్స్ట్రుమెంట్లు మోయడంతో...
ఉపాధి వెతుక్కుంటూ రామగుండం వెళ్లాను. గాయకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ పరిచయంతో దూరదర్శన్లో అవకాశం వచ్చింది. ఆయన ద్వారానే గాయకులు వరంగల్ శంకర్, సారంగపాణి పరిచయం అయ్యారు. వాళ్ల ఆర్కెస్ట్రా గ్రూప్ లో ఇన్స్ట్రుమెంట్లు మోసేవాడిని. క్రమంగా సింగర్గా, మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎదిగాను. తొలుత  పది రూపాయలిచ్చినోళ్లే ప్రోగ్రాంకు ఇంత అని ఫిక్స్ చేశారు.

కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఇచ్చిన మిమిక్రీ ప్రోగ్రామ్స్ పేరు తెచ్చిపెట్టాయి. మిత్రలు సలహాతో హైదరాబాద్ వచ్చాను. సానా యాదిరెడ్డి గారి పరిచయంతో 'పిట్టలదోర', 'ప్రేమపల్లకి'లో పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. 'బ్యాచ్లర్స్' సినిమాతో బ్రేక్ వచ్చింది. 'ఈతరం ఫిలిమ్స్' అధినేత పోకూరి బాబూరావు తన ఆఫీసుకు పిలిపించి హీరోయిన్ మీనా పక్కన 'అమ్మాయి కోసం' సినిమాలో హీరోగా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.