ఎల్వీ ప్రసాద్‌ వల్లే ఈ స్థాయిలో ఉన్నాను – కృష్ణంరాజు

18 Jan, 2020 01:29 IST|Sakshi

‘‘ఎల్వీ ప్రసాద్‌గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపాదించిన  ప్రతి పైసా సినిమా పరిశ్రమ ఎదుగుదలకి, సినిమా ఇండస్ట్రీపై గౌరవం రావడానికి ఖర్చు చేశారు. ఆయనతో నాకు ఉన్న అనుబంధమే నన్ను ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది’’ అన్నారు ప్రముఖ నటుడు కృష్ణంరాజు. ప్రముఖ దర్శక–నిర్మాత, నటుడు ఎల్వీ ప్రసాద్‌ 112వ జయంతి వేడుకలు బుధవారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణంరాజు మాట్లాడుతూ – ‘‘అప్పట్లో నేను నటించిన ‘చిలకా గోరింక’ సినిమా విడుదలై ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. ఆ సమయంలో సినీ పరిశ్రమ వదిలేసి వెళ్లిపోదామనుకున్నాను. అప్పుడే ‘నేనంటే నేనే’ అనే సినిమా కోసం డూండీగారు నన్ను సంప్రదించారు.

ఈ సినిమాలో ఉన్న మూడు పాత్రల్లో ఒకటి కృష్ణగారు, మరొకటి నాగభూషణంగారు చేస్తున్నారని చెప్పారు. ఇంకో పాత్ర కోసం నన్ను అడిగారు. అయితే ఆ పాత్రలో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న కారణంగా ఆ సినిమా చేయకూడదనుకున్నాను.ఓ సందర్భంగా ఎల్వీ ప్రసాద్‌గారిని కలిసినప్పుడు ఆయనకు ఈ విషయం చెప్పాను. ‘సినిమాలో నువ్వు హీరోవా? విలన్‌వా? అని కాదు. ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులకు ఎంత చేరువ అవుతావు అన్నదే ముఖ్యం’ అని ఆయన నాకు హితబోధ చేశారు. దాంతో నేను ‘నేనంటే నేనే’ చిత్రంలో నటించాను. ఆ చిత్రం విజయవంతమైంది. ఆ తర్వాత విభిన్నమైన పాత్రలు చేసి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందుకు దోహదపడిన ఎల్వీ ప్రసాద్‌ గారికి రుణపడి ఉంటాను.

వారి కుటుంబంతో కూడా నాకు మంచి సాన్నిహిత్యం ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అన్నారు. ‘‘నా జీవితంలో మా నాన్నగారితో నేను గడిపిన క్షణాలన్నీ మధుర జ్ఞాపకాలే. ఆయన అంతగా చదువుకోలేదు. ఎంతో కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయన అంకితభావం చాలా గొప్పది. ఆ అంకితభావంతోనే అన్ని భాషలు మాట్లాడటం నేర్చుకున్నారు. ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత నేను టెక్నికల్‌వైపు  మారాను. ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటేడ్‌ బ్యానర్‌పై మా నాన్నగారు ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. తన సినిమాలు చూసి తనను గొప్పవాడిని చేసిన ప్రజలకు మంచి చేయాలని ఓ ట్రస్ట్‌ను స్థాపించారు. సినిమాల ద్వారా వచి్చన కోటి రూపాయలను డొనేషన్‌గా ఇచ్చారు. ఆ డబ్బుతోనే ఎలీ్వప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించారు. ‘బాహుబలి’ లాంటి గొప్ప సినిమాలు రావడానికి మా సపోర్ట్‌ను కంటిన్యూ చేస్తాం’’ అన్నారు ఎలీ్వ ప్రసాద్‌ గ్రూప్స్‌ అధినేత రమేష్‌ ప్రసాద్‌.  

‘‘ఎల్వీ ప్రసాద్‌గారి జయంతి సందర్భంగా ప్రసాద్‌ సురేటివ్‌ మెంటార్స్‌ ఫిలిం అండ్‌ మీడియా స్కూల్‌లో శిక్షణ పొందినవారికి గోల్డ్‌ మెడల్స్‌తో ప్రీ కాన్వకేషన్‌ ప్రదానం చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు ప్రసాద్‌ సురేటివ్‌ మెంటార్స్‌ ఫిలిం అండ్‌ మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కొవ్వూరి సురేష్‌ రెడ్డి. ‘‘ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన ఎందరో మహామహా నటులు ఎల్వీ ప్రసాద్‌గారి సినిమాల ద్వారా పరిచయమయ్యారు. అటువంటి ఆయనకు చెందిన ఈ ఫంక్షన్‌కు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు తెలంగాణ ప్రభుత్వ ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌.  ఈ వేడుకలో కృష్ణంరాజు సతీమణి శ్యామల, రమేష్‌ ప్రసాద్‌ కుమార్తె రాధ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు