యుక్త వయసును మిస్ అయ్యాను

7 Sep, 2014 08:48 IST|Sakshi
యుక్త వయసును మిస్ అయ్యాను

 సంగీతంతో గడుపుతూ యుక్త వయసును మిస్ అయ్యానని ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. అందువలనే ఆయన ఆస్కార్ అవార్డు గ్రహీతలయ్యారన్నది జగమెరిగిన సత్యం. ఈ సంగీత మాంత్రికుడు మాట్లాడుతూ, ప్రస్తుతం సంగీతానికి బలం వున్న కథా చిత్రాలనే అంగీకరిస్తున్నట్లు తెలిపారు. అలా కాకుంటే తన అభిమానులను కోల్పోవలసి వస్తుందన్నారు. చరిత్ర కథా చిత్రాలకు సంగీతాన్ని అందించిన తరువాత ఇప్పుడు యువకుల చిత్రాలకు పని చేస్తున్నానన్నారు.
 
 అయితే చారిత్రక కథా చిత్రాలకు సంగీతం అందించి అలసిపోలేదన్నారు. అలాంటి చిత్రాలకు పని చేస్తునే ఉంటానని చెప్పారు. నిజం చెప్పాలంటే అలాంటి చరిత్ర కథా చిత్రాలకు పని చేస్తున్నప్పుడు కొత్త సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. కొన్ని చిత్రాలకు నేపథ్య సంగీతం మాత్రమే అందించాల్సి వస్తోందన్నారు. కారణం ఆ చిత్రాల్లో పాటలకు చోటుండకపోవడమేనన్నారు. అలాంటి సంగీతం 30, 40 శాతం అభిమానులకే చేరుతుందన్నారు.
 
 వినూత్న కథా చిత్రాలకు సంగీతాన్ని అందించడానికి కారణం ఆ పాటలను తెరపై తారలు పాడినట్లే ఫీలింగ్ కలుగుతుండటమేనని పేర్కొన్నారు. మరో విషయం ఏమిటంటే తాను చిన్న వయసులోనే 40 ఏళ్లపైబడిన సంగీత దర్శకులతో గడిపానని చెప్పారు. అందువలన యుక్త వయసును తాను ఎంజాయ్ చేయలేకపోయానన్నారు. అయితే ఇప్పటికీ తాను యువకుడిననే భావనతోనే ఉన్నానని రెహ్మాన్ పేర్కొన్నారు.