'నేనా సినిమా చేయట్లేదు' : కృతిసనన్

26 Dec, 2015 09:37 IST|Sakshi
'నేనా సినిమా చేయట్లేదు' : కృతిసనన్

'వన్ నేనొక్కడినే' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల భామ కృతి సనన్, తరువాత నాగచైతన్య సరసన దోచెయ్ సినిమాలోనూ నటించింది. సౌత్ ఇండస్ట్రీలో అదృష్టం కలిసి రాక బాలీవుడ్ బాట పట్టిన ఈ బ్యూటీ అక్కడ మంచి అవకాశాలనే పట్టేసింది. షారూక్ ఖాన్ లీడ్ రోల్ తెరకెక్కిన దిల్వాలే సినిమాలో ఛాన్స్ కొట్టేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే సినిమా కూడా కృతిని సక్సెస్ ట్రాక్ ఎక్కించలేకపోయింది.

సక్సెస్ సంగతి ఎలా ఉన్న కృతి సనన్ పేరు మాత్రం బాలీవుడ్లో మారుమోగిపోతుంది. దిల్వాలే సినిమా తరువాత ఈ పొడుగు కాళ్ల సుందరి.. సల్మాన్ హీరోగా నటిస్తున్న సుల్తాన్ సినిమాలో నటించడానికి అంగీకరించిందంటూ వార్తలు వినిపించాయి. ఆ తరువాత ఆ సినిమా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ పెట్టిన కండీషన్స్ నచ్చక ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని టాక్ వినిపించింది. దీంతో ఎన్నడూ లేనిది యష్ రాజ్ ఫిలింస్ కూడా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

తాజాగా కృతి సనన్ కూడా ఈ రూమర్స్పై స్పందించింది. 'నేను మరోసారి మీకో విషయంలో క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. నాకు సుల్తాన్ చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదు. కాబట్టి యష్ రాజ్ ఫిలింస్ సంస్థ ఎలాంటి కండిషన్స్ పెట్టే అవకాశమే లేదు' అంటూ ట్వీట్ చేసింది. దీంతో సుల్తాన్ హీరోయిన్ కృతీనే అంటూ వచ్చిన వార్తలకు తెరపడింది.