సింగిల్గా హ్యాపీ....పెళ్లికి తొందర లేదు

28 Dec, 2015 15:08 IST|Sakshi
సింగిల్గా హ్యాపీ....పెళ్లికి తొందర లేదు

హైదరాబాద్: ఇంకా ఎవరితోనూ  ప్రేమలో పడలేదని, ఒంటరిగా  సంతోషంగానే ఉన్నానని టాలీవుడ్  మోస్ట్ ఎలిజిబుల్  బ్యాచిలర్, విలక్షణ నటుడు దగ్గుబాటి రానా  వ్యాఖ్యానించాడు.  అప్పుడే పెళ్లికి తొందరేముందంటూ వ్యాఖ్యానించాడు.  2015 సంవత్సరంలో చాలా ఉత్థాన పతనాలను చవిచూసిన   బల్లాలదేవ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు.  

ఈ ఏడాది బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ల్లో  ఏకకాలంలో పనిచేయడంలో పెద్ద కష్టమనిపించలేదని రానా తెలిపాడు. ఈ సంవత్సరం తీవ్రమైన ఎత్తు పల్లాల మధ్య గడిచిందని, మంచి, చెడు రెండింటిని మిగిల్చిందని అతడు గుర్తు చేసుకున్నాడు. జీవితంలో 2015 సంవత్సరం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నాడు.  ముఖ్యంగా తాతగారు రామానాయుడ్ని కోల్పోవడం  చాలా  బాధ కలిగించిందని తెలిపాడు. అలాగే రెండు సంవత్సరాల విరామం తరువాత వచ్చిన బాహుబలి, రుద్రమదేవి  ఘన విజయం సాధించి తన కెరియర్లో మైలురాళ్లుగా  నిలిచాయని రానా పేర్కొన్నాడు.

'కాలం కరిగిపోయే క్షణాల సమూహమైతే, సినిమా అన్నది కలకాలం నిలబడే  శిల్పం' అని తాతగారు ఎపుడూ చెప్పే మాటలను గుర్తు చేసుకుంటూ వుంటానని రానా పేర్కొన్నాడు.  విలక్షణమైన, విభిన్నమైన క్యారెక్టర్లను చేయడమే తనకిష్టమని సింగిల్ ఫార్ములా  పాత్రలంటే తనకు పడదని తెలిపాడు.  పాత్ర  నచ్చితే దాని ప్రాధాన్యాన్ని బట్టి నిడివితో సంబంధం లేకుండా  క్యారెక్టర్ను ఎంచుకుంటానని చెప్పాడు. కథ నచ్చితే రెండో ఆలోచనల లేకుండా  విలన్ పాత్ర చేయడానికైనా సిద్ధమని, రుద్రమదేవి, బాహుబలి సినిమాల్లో నటించేందుకు అదే కారణమని తెలిపాడు. సినిమాల్లో నటించే  పాత్రల ద్వారా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవచ్చని ఈ కండలవీరుడు చెప్పుకొచ్చాడు.  బెంగళూరు డేస్ సినిమా తనకు  మంచి అనుభవాన్ని మిగిల్చిందని రానా తెలిపాడు.

సినిమాల్లో డ్యాన్సులు చేయాల్సిన అవసరం తనకు కనిపించలేదని, అందరూ హీరోలు చేసే పనే అని..మళ్లీ కొత్తగా తనెందుకు చేయాలని ప్రశ్నించారు.  వాస్తవానికి అనవసరమైన పాటలు, డ్యాన్సులు తనకు నచ్చవన్నారు. 'నా ఇష్టం' లాంటి సినిమాలు  తనకు సరిపడవని, అసలు ఆ సినిమా  తాను చేసి ఉండాల్సింది కాదని  వ్యాఖ్యానించాడు.   చెన్నై వరద బాధితులకు సహాయ పనులతోనూ  తన సోదరి మాళవిక  కూతురు అయిరాతో ఈ సంవత్సరాంతం గడిచిందని చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో  మరిన్ని ప్రత్యేకమైన, బెంచ్ మార్క్గా నిలిచే సినిమాల్లో నటించాలని  ఉందని తెలిపాడు.