'ఆ హీరోయిన్ కష్టాలు ఎవరూ పడలేదు'

21 Apr, 2016 18:45 IST|Sakshi
'ఆ హీరోయిన్ కష్టాలు ఎవరూ పడలేదు'

న్యూఢిల్లీ: బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఏదో ఓ వివాదంలో చిక్కుకోవడం ఆమెకు అలవాటు. అయితేనేం, ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థాయికి ఎదగడమే కాదు ఒక్క జాతీయఅవార్డు అంటూ ఎంతోమంతి ఎదురుచూసే ఆ అవార్డును మూడుసార్లు కొల్లగొట్టేసింది. ఈ విషయాలను బట్టి ఆ హీరోయిన్ మరెవరో కాదు కంగనా రనౌత్ అని తేలికగా చెప్పేవచ్చు. ఆమె ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుందని డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'తను వెడ్స్ మను', 'తను వెడ్స్ మను రిటర్స్స్' మూవీలు కంగనాకు చాలా పేరు తీసుకొచ్చాయి. ఆ హీరోయిన్ లో ఆయన గమనించిన విషయాలను పేర్కొన్నాడు.


గత ఐదారేళ్లలో ఆమె ఎంతో పరిణతి చెందిందని, ఇతర హీరోయిన్ ఎవరైనా ఈ స్థాయిలో పైకి ఎదగలేకపోయేవారని చెప్పుకొచ్చాడు. కంగనాపై హీరో హృతిక్ రోషన్ వ్యాఖ్యలు చేయడంలో కూడా సీరియస్ గా స్పందించాడు. ఒకరి వ్యక్తిగత జీవితంపై మరొకరు కామెంట్లు చేయడం ఏంటని హృతిక్ ను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ వివాదంపై తాను కంగనాతో ఎప్పుడూ టచ్ లో ఉండేవాడినని కానీ సలహాలు ఇవ్వలేదన్నాడు. కంగనా చాలా తెలివైన హీరోయిన్ అని, స్వతహాగా తాను నిర్ణయాలు తీసుకోగలదని డైరెక్టర్ ఆనంద్ రాయ్ అభిప్రాయపడ్డాడు. ఇద్దరు సెలబ్రిటీల మధ్య మాత్రమే కాదు సాధారణ వ్యక్తుల మధ్య కూడా వివాదాలు తలెత్తుతాయని, అయితే సమస్యలను ఎదుర్కోవాలని... వాటి నుంచి తప్పించుకోలేమని కంగనా ఈ విషయాన్ని డీల్ చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.