నాకు క్లాసూ తెలుసు... మాసూ తెలుసు..!

22 Oct, 2013 01:38 IST|Sakshi
నాకు క్లాసూ తెలుసు... మాసూ తెలుసు..!
‘అహ నా పెళ్లంట’, ‘పూలరంగడు’ విజయాలతో క్లాస్‌నీ మాస్‌నీ ఆకట్టుకున్న వీరభద్రమ్ ‘భాయ్’తో హ్యాట్రిక్ కొడతానంటున్నారు. తన మూడో సినిమానే నాగార్జునలాంటి అగ్ర హీరోతో చేసే అవకాశం రావడం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని వీరభద్రమ్ సంతోషం వెలిబుచ్చారు. ‘భాయ్’ ఈ 25న విడుదలవుతున్న సందర్భంగా వీరభద్రమ్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
 
 ***  మరో మూడు రోజుల్లో ‘భాయ్’ రిలీజ్‌కి రెడీ. ఎలా అనిపిస్తోంది?
 పరీక్ష ఫలితం కోసం ఎదురుచూస్తున్న స్టూడెంట్‌లా ఉంది నా పరిస్థితి. ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం వంద శాతం ఉంది. అయితే ప్రేక్షకుల స్పందన తెలుసుకోవాలనే ఉద్వేగం ఎక్కువగా ఉంది.
 
 ***  దర్శకుడిగా ఇప్పటికి రెండు పరీక్షలు రాసి, పాసయ్యారు. కానీ, ఇది పెద్ద పరీక్ష కదా?
 నిజమే! నాగార్జునగారు హీరోగా నటించడానికి అంగీకరించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్‌పై ఆయనే నిర్మించారు. ఇది చిన్న విషయం కాదు. పైగా, నా గత చిత్రాలకన్నా ఇది పెద్ద బడ్జెట్ చిత్రం. అందుకే ‘భాయ్’ని ఓ సవాల్‌గా తీసుకున్నా. కచ్చితంగా ఈ పెద్ద పరీక్ష కూడా నాకు మంచి అనుభూతినే మిగులుస్తుంది.  నా మొదటి సినిమా విడుదలైనప్పుడు నేను గ్యారంటీగా హిట్ అనే నమ్మకంతో ఉండేవాణ్ణి. కానీ, అందరూ ‘ఓకే.. మాములుగా ఆడుతుంది’ అనుకునేవాళ్లు. అయితే, అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ‘పూలరంగడు’ సూపర్ హిట్ అవుతుందన్నాను. అప్పుడూ ‘ఓకే... ఏదో హిట్ అవుతుంది’ అనుకున్నారు. అది కూడా ఘనవిజయం సాధించింది. దాంతో నా ఆలోచనలు, నా టేకింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయనే నమ్మకం రెట్టింపు అయ్యింది.
 
 ***  మీకు మాస్ ప్రేక్షకుల పల్స్ బాగా తెలుసని నాగార్జున అన్నారు. ఆ మాస్ పల్స్ ఎలా పట్టుకోగలిగారు?
 నేను విలేజ్ నుంచి వచ్చినవాణ్ణి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. అందుకని అటు విలేజ్, ఇటు సిటీ లైఫ్ నాకు తెలుసు. మాస్, క్లాస్.. రెండు రకాల వ్యక్తులతో నాకు పరిచయాలున్నాయి. అందుకని వాళ్ల మనసులను తెలుసుకునే వీలు కలిగింది. పైగా నాలోనూ ఓ మాస్ ప్రేక్షకుడు ఉన్నాడు. ఆ విధంగా నాకు మాస్ పల్సే కాదు. క్లాస్ పల్సూ తెలుసు!
 
 ***  నాగార్జున గారితో పనిచేయడం గురించి?
 నాగార్జునగారు ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రెండు, మూడు రోజులు స్వీట్‌షాక్‌లో ఉండిపోయాను. మొదటి షెడ్యూల్ బ్యాంకాక్‌లో చేశాం. ఓ మూడు, నాలుగు రోజులు బెరుగ్గా చేశాను. కానీ, నాగార్జునగారు ఇచ్చిన స్వేచ్ఛతో ఆ తర్వాత బెరుకుతనంపోయింది. దాంతో బాగా చేయగలిగాను. ఓ స్టార్ హీరోని హ్యాండిల్ చేయగలననే కాన్ఫిడెన్స్‌ని ఇచ్చారు నాగార్జునగారు.
 
 ***  ఏడేళ్ల క్రితమే ‘భాయ్’ కథ అనుకున్నానని చెప్పారు... మరి, ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్టుగా ఉంటుందా?
 నేను ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’కి కో-డెరైక్టర్‌గా చేశాను. హిందీ చిత్రం ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’కి అది రీమేక్. ఆ టైటిల్‌లోని ‘భాయ్’ నాకు క్యాచీగా అనిపించింది. అప్పుడే ఆ టైటిల్ అనుకుని, స్టోరీలైన్ తయారు చేసుకున్నా. నాకు తెలిసి కొత్త కథలంటూ పుట్టవు. వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో వచ్చిన కథలే రిపీట్ అవుతున్నాయి. కాకపోతే కథనం, కథలోని ఎమోషన్స్, డైలాగ్స్, సాంగ్స్ పరంగా ట్రెండ్ మారుతుందని నా ఫీలింగ్. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని, ‘భాయ్’ చేశాను. లేటెస్ట్ ట్రెండ్‌కి తగ్గట్టుగా స్టయిలిష్‌గా ఉండే చిత్రం ఇది. నాగార్జునగారి స్టయిల్‌కి అనుగుణంగా కథను మలిచాను.
 
 ***  ఏడేళ్ల క్రితం అనుకుని, ఈ మధ్యే నాగార్జునని అప్రోచ్ అయ్యారెందుకని?
 దర్శకుడిగా ముందు నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే, రెండు విజయాల తర్వాత నాగార్జునగార్ని కలిశాను. ఆయన ‘షిరిడీ సాయి’ సినిమా చేస్తున్న సమయంలో, సాయిబాబా గెటప్‌లో ఉండగా, కలిశాను. టైటిల్ చెప్పగానే ఆయనకు నచ్చేసింది. దాదాపు గంటన్నర కథ విని, చేద్దాం అన్నారు. 
 
 ***  ‘మొదట ట్రెండ్ సెట్ చేసింది నువ్వే కదన్నా..’ అనే డైలాగ్ ఈ సినిమాలో పెట్టడానికి కారణం?
 ఇది ఏ హీరోనీ ఉద్దేశించి పెట్టింది కాదు. ఈ డైలాగ్ కూడా ఎప్పుడో అనుకున్నదే. అప్పట్లో ‘శివ’తో నాగార్జునగారు ఓ ట్రెండ్ సెట్ చేశారు. ఆ సినిమాకి కనెక్ట్ చేసి, ఈ డైలాగ్ రాశాను. 
 
 ***  మీ తదుపరి చిత్రాలు?
 రెండు పెద్ద సినిమాలున్నాయి. వాటి వివరాలు త్వరలో చెబుతా.
 
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి