నా భర్తను ప్రతిరోజూ తిడతాను: నటి

19 Feb, 2018 13:02 IST|Sakshi

సాక్షి, ముంబై: ‘ఔను నా భర్తను ప్రతిరోజూ తిడతాను. దూషిస్తాను. కానీ ద్వేషంతో కాదు. ప్రేమతో. అతను ప్రేమతో చేసే విషయాలు చూసి తిడతాను. అందులో ప్రేమ తప్ప ద్వేషం లేదు. నేను ఎవరినైనా తిట్టానంటే.. వారిని నిజంగా ప్రేమించినట్టు’ అంటోంది బాలీవుడ్‌ నటి రాణి ముఖర్జీ. ప్రముఖ నిర్మాత, యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ అధినేత ఆదిత్యచోప్రాను నాలుగేళ్ల కిందట రాణి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారికి అధీర అనే రెండేళ్ల కూతురు ఉంది.

పెళ్లి, సంతానం నేపథ్యంలో సినిమాల నుంచి విరామం తీసుకున్న రాణి ఇప్పుడు ‘హిచ్‌కీ’ అనే వినూత్న సినిమాతో త్వరలోనే ప్రేక్షకులను పలుకరించబోతోంది. మాట్లాడుతున్నప్పుడు ‘హిచ్‌క్క్‌’ అంటూ వింత శబ్దం చేసే  ఓ స్కూల్‌ టీచర్‌ ఏవిధంగా తన విద్యార్థులను తీర్చిదిద్దిందనే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాణి ముఖర్జీ తాజాగా నేహా ధూపియా చాట్‌లో ముచ్చటించింది. సెలబ్రిటీ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తన పెళ్లి, వైవాహిక జీవితం, తమ అనుబంధం గురించి వివరించింది.

‘ముఝ్‌సే దోస్తీ కరోగీ’ సినిమా సమయంలో తొలిసారి ఆదిత్య చోప్రాతో పరిచయం అయిందని, ఆ పరిచయం ప్రేమగా మారిందని రాణి తెలిపింది. తనకు, ఆదిత్యకు పెద్దగా ప్రచార ఆర్భాటాలు, ఆడంబరాలు ఇష్టం ఉండవవని, అందుకే కేవలం 12మంది సమక్షంలో నిరాడంబరంగా తమ పెళ్లి జరిగిందని రాణి వెల్లడించింది. అందరూ సెలబ్రిటీ కిడ్స్‌ తరహాలో తమ చిన్నారి అధిరా ఫొటోలు మీడియాలో, సోషల్‌ మీడియాలో కనిపించడం తమకు నచ్చదని, అందుకే తనను ఎక్కువగా ఫొటోలు తీసేందుకు ఇష్టపడమని చెప్పింది.

మరిన్ని వార్తలు