ప్రేమపై నమ్మకం లేదు

29 Dec, 2015 02:44 IST|Sakshi
ప్రేమపై నమ్మకం లేదు

జీవితంలో అతి ముఖ్యమైన భాగం ప్రేమది. ఏ ఇద్దరి మధ్య అయినా అనుబంధాన్ని పెంచడానికి ప్రేమ అన్నది చాలా అవసరం. అలాంటి ప్రేమపై నమ్మకం లేదు అంటున్నారు నటి సమంత. అయితే ఆమెను ప్రేమలో ఓడిన అనుభవం అలా మాట్లాడించి ఉండవచ్చు.
 
 సమంత ప్రేమ వ్యవహారం గురించి చాలా వదంతులు ప్రచారంలో ఉన్నాయి. తమిళ చిత్రం బానాకాత్తాడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన నటి ఈ చెన్నై సుందరి. ఇక్కడ తొలి రోజుల్లో అపజయాలను చవి చూసినా, అవన్నీ అధిగమించి ఇప్పుడామె టాప్ నాయకిగాగా ప్రకాశిస్తున్నారు.
 
  టాలీవుడ్‌లోనూ తన హవా సాగించుకుంటున్న సమంత ప్రస్తుతం విజయ్ సరసన తెర్రి, సూర్యకు జంటగా 24, ధనుష్‌తో వడచెన్నై చిత్రాలలో నటిస్తున్నారు. టాలీవుడ్‌లోనూ మహేశ్‌కు జంటగా బ్రహ్మోత్సవం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అఆ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
 ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ తన కథా పాత్రలకు ప్రాముఖ్యత ఉందనిపిస్తేనే కొత్త చిత్రాలలో నటించడానికి అంగీకరిస్తున్నానన్నారు. స్క్రిప్టుల ఎంపిక  విషయంలో నిర్ణయం తనదేనని, ఇతరుల జోక్యం ఉండదనీ స్పష్టం చేశారు.
 
 కాబట్టి తన జయాపజయాలకు పూర్తి బాధ్యురాలిని తానేనని చెప్పారు. ధనుష్‌కు జంటగా వెట్ట్రిమారన్ దర్శకత్వంలో రూపొందుతున్న వడచెన్నై చిత్రంలో గుడిసె వాసి యువతిగా నటిస్తున్నానని చెప్పారు. ఆ పాత్రగా మారడానికి తగిన చర్యలు తీసుకుంటున్నానన్నారు. ఈ చిత్రం తన సినీకెరీర్‌లో చాలా ముఖ్యమైందిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
 
  తన వరకూ తాను తెరపై నటిగానే కనిపించాలనుకుంటానని, హీరోయిన్ అనిపించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక పోతే తన వివాహం గురించి అడుగుతున్నారనీ, ఆ విషయం గురించి ప్రస్తుతానికి ఆలోచించిలేదని పేర్కొన్నారు. అదే విధంగా తనకు ప్రేమపై నమ్మకం లేదని  సమంత అన్నారు.