ఆ విషయంలో సినిమాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి!

23 Feb, 2014 23:24 IST|Sakshi
ఆ విషయంలో సినిమాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి!
‘‘అన్నీ బాగుంటే జీవితం మధురంగా ఉంటుంది. కానీ, విధి చిన్న చూపు చూస్తే మాత్రం భారంగా  మారిపోతోంది. ఆ భారాన్ని ఆత్మస్థయిర్యంతో మోయగలిగితే ఆనందం మన సొంతం అవుతుంది’’... ఏంటీ ఉపోద్ఘాతం అనుకుంటున్నారా? నేపాలీ సుందరి మనీషా కొయిరాలా ప్రస్తుతం ఈ విధంగానే మాట్లాడుతున్నారు. రెండుమూడేళ్ల క్రితం వరకు జీవితం గురించి ఆమె అంత లోతుగా ఆలోచించేవారు కాదు. కానీ, కేన్సర్ వ్యాధి సోకిన తర్వాత ఆమె ఆలోచనల్లో మార్పొచ్చింది. కేన్సర్ వ్యాధి గురించి అవగాహన కలిగించే కార్యక్రమాల్లో పాల్గొని, పదిమందిలో ఆత్మస్థయిర్యం నింపుతున్నారామె.ఇక మనీషా మనోభావాలు తెలుసుకుందాం...
 
+ నేను ఒకప్పటి మనీషాని కాదు. ఇప్పుడు ఏ విషయాన్నయినా స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతున్నాను. జీవితం చాలా విలువైనది. ‘ఈరోజు మనం బతికున్నందుకు ఆనందపడాలి’ అనే భావన ప్రతి ఒక్కరికీ కలగాలి. ఎందుకంటే, ఏ రోజు ఏం జరుగుతుందో మనం ఊహించలేం. అలాగే, మన చుట్టూ ఉన్నవాళ్లని గౌరవించాలి, ప్రేమించాలి. ఎందుకంటే, ఎవరు ముందు.. ఎవరు వెనకా అనేది ఒక్క దేవుడికి తప్ప ఎవరికీ తెలియదు. మనిషి లేని లోటు పూడ్చలేనిది. 
 
+ కేన్సర్ వ్యాధి సోకిందనగానే అప్పటికప్పుడు భూమి బద్దలైపోయినట్లు, ప్రపంచం తలకిందులైపోయినట్లుగా డీలా పడిపోతారు చాలామంది. అది సహజం. కానీ, ఆ వ్యాధి గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడంతో పాటు చికిత్సా విధానాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మానసికంగా కుంగిపోతే శారీరకంగా బలహీనపడిపోతాం. ఫలితంగా చికిత్స చేయించుకోవడానికి వీలు లేనంతగా ఆరోగ్యం పాడైపోతుంది.
 
సినిమాల ప్రభావం ప్రజల్లో ఉంటుంది. మన సినిమాల్లో కేన్సర్ అంటే ఆ పాత్ర బతికి బయటపడినట్లుగా చూపించరు. ఆ పాత్ర చనిపోవాల్సిందే. ఆ విధంగా ప్రేక్షకులను సినిమాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఆ ప్రభావం ఉన్నందునో ఏమో కేన్సర్ అనగానే ఇక బతుకు మీద ఆశ వదులుకోవాల్సిందేనని ఫిక్స్ అవుతున్నారు. అదే కనుక సినిమాల్లో ఈ వ్యాధికి చికిత్స చేయించుకుంటే, నిక్షేపంగా బతకొచ్చని చూపిస్తే, కేన్సర్‌ని పెనుభూతంలా చూడటం తగ్గుతుందేమో.
 
+ కేన్సర్ వ్యాధి, చికిత్సా విధానం గురించి మన దేశంలో చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు. కానీ, మారుమూల పల్లెల సంగతేంటి? అక్కడ కనీస సౌకర్యాలుండవు. నిరక్షరాస్యుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. మా కుటుంబంలో అందరం ఉన్నత చదువులు చదువుకున్నవాళ్లమే. అందుకే, పరీక్షల అనంతరం నాకు ‘ఒవేరియన్ కేన్సర్’ అనగానే, దాని గురించి పూర్తిగా స్టడీ చేశాను. చికిత్సా విధానాన్ని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను తెలుసుకున్నాను. కానీ, చదువుకోనివారికి ఇవన్నీ తెలియవు. అందుకే, గ్రామాలకు వెళ్లి, అక్కడున్న మహిళలకు కేన్సర్ వ్యాధిపై అవగాహన కలిగించే పని చేస్తున్నాను. కేన్సర్ అనగానే వాళ్లు విపరీతంగా భయపడిపోతున్నారు. వ్యాధి వల్ల కాకుండా భయంతోనే చాలామంది చనిపోతున్నారు. కొంతమందైతే చికిత్స చేయించుకున్నా ఉపయోగం ఉండదని ఫీలైపోయి, ట్రీట్‌మెంట్ తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. లేనిపోనివి ఊహించేసుకుని ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. 
 
+ గతం గతః అంటారు. గతం తాలూకు తీపి జ్ఞాపకాలను గుర్తుంచుకోవచ్చు. కానీ, మర్చిపోదగ్గ విషయాలను మాత్రం మనసులో ఉంచుకోకూడదు. యూఎస్‌లో నాకు చికిత్స జరిగిన రోజులను మర్చిపోవాలనుకుంటున్నాను. అవి చాలా బాధాకరమైనవి. చికిత్స చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో బయటపడినా, మన గురించి అవతలివాళ్లు ఏమనుకుంటున్నారో అని మధనపడేదాన్ని. ఆ తర్వాత నా పద్ధతి మార్చుకున్నాను. ఆ దేవుడు మనకు ఎంతో బలాన్నిచ్చాడు. ఆ బలాన్ని ఆయుధంగా చేసుకుని పరిస్థితులను ఎదురీదాలి అనే భావన కలిగింది. అప్పట్నుంచీ ఎవరేమనుకుంటున్నారనే ఆలోచన నాకు కలగలేదు. భయపడటం మానేశాను. ఇప్పుడు జీవితం హాయిగా ఉంది. ఓ భీకర పోరాటంలో గెలిచానన్న ఆత్మసంతృప్తి మిగిలింది.
 
+ ఒక్క చిన్న కుదుపు తర్వాత ఏ బండైనా సాఫీగా సాగుతుంది. జీవితం కూడా అంతే. కేన్సర్ అనే చిన్న కుదుపు నుంచి బయటపడ్డాను. ఆత్మవిశ్వాసం ఉంటే నాలా చాలామంది బయటపడొచ్చు. ఇక, సినిమాలపై దృష్టి సారించాలనుకుంటున్నా. గతంలో చెయ్యకూడని కొన్ని సినిమాలు చేశాను. ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్త వహిస్తా. పాత్ర బాగుంటే రణబీర్ కపూర్‌కి అక్కగా నటించడానికి రెడీయే. నాలో మంచి నటి ఉంది. ఆ నటికి న్యాయం జరుగుతుందనిపించే సినిమాలు చేస్తాను.