నేను తీసిన ఫొటోలతో త్వరలో వెబ్‌సైట్

14 May, 2016 01:53 IST|Sakshi
నేను తీసిన ఫొటోలతో త్వరలో వెబ్‌సైట్

ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీప్రసాద్
 
రాయదుర్గం: తనకు ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ అంటే చాలా ఇష్టమని, ఏ మాత్రం ఖాళీ దొరికినా ఫొటోలు తీస్తుంటానని ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. రాయదుర్గం లోని జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఫోటో ఎక్స్‌పో-2016ను ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా తన మనోగతాన్ని విలేకరులతో పంచుకున్నారు.  నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చే కెమెరాలను కొన్నేళ్ళుగా కొనుగోలు చేస్తూ భద్రపర్చుకుంటున్నానన్నారు. తాను తీసిన ఫొటోలన్నింటినీ ఒక చోట పెట్టడానికి ప్రత్యేకంగా ఒక ప్రదర్శన కన్నా వెబ్‌సైట్ లాంచ్ చేసి అందులో పెట్టాలని ఉందని, త్వరలో ఈ విషయమై సీరియస్‌గా ఆలోచిస్తున్నానన్నారు.

ఎక్కడికి వెళ్ళినా రోడ్లు, ఖాళీ స్థలాలు, పార్కులు, అందమైన ప్రాంతాలు, మోడల్స్, డ్యాన్సర్స్ ఫొటోలను హబీగా తీస్తుంటానన్నారు. తన తండ్రి సత్యమూర్తి మంచి ఫొటోగ్రాఫర్ అని, తరువాత తయన రైటర్‌గా మారారన్నారు. తనకు కారం అంటే పడదని, అందుకే మా అమ్మ నా ఒక్కడి కోసం వేరుగా వంటచేసేదన్నారు. ఫొటోగ్రఫీలో కొత్త కొత్త అంశాల గురించి ఏవైనా సందేహాలు ఉంటే అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా విల్లార్ట్ ఎం.డీ వెంకటరమణకు ఫోన్ చేసి విసిగించి సందేహాలను తీర్చుకుంటానని దేవిశ్రీప్రసాద్ తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలలో పిల్లలు మ్యూజికల్ ఇన్‌స్ట్రమెంట్స్ వాయిస్తుంటే ఫొటోలు తీయాలనే కోరిక ఉందని, కొన్ని చోట్ల తీశానన్నారు.  మనదేశంలోని పిల్లలు డప్పు కొట్టే ఫొటోలను తీసి నా స్టూడియోలో ఒక గోడను ఖాళీగా ఉంచానని, దానిపై ఈ ఫొటోలన్నింటినీ ఒకేచోట అమర్చాలని చాలా రోజులుగా ఈ కోరిక ఉందని, దీనిపై దృష్టి పెట్టానన్నారు. సంగీతానికి ఫొటోగ్రఫికి చాలా అవినాభావ సంబంధం ఉందని దేవిశ్రీప్రసాద్ తెలిపారు.