నిర్మాతలకు బానిసలుగా ఉండాలా?: శ్రీరెడ్డి

24 Apr, 2018 16:29 IST|Sakshi

సరోజ్‌ ఖాన్‌ వ్యాఖ్యలు సరికాదుఆమెపై గౌరవం పోయింది..

సాక్షి, హైదరాబాద్‌ : సినీ పరిశ్రమలో నెలకొన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ సంస్కృతిని సమర్థిస్తూ ప్రముఖ బాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ సరోజ్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్యాస్టింగ్‌ కౌచ్‌ సమర్థనీయమని, ఇది వర్థమాన నటీమణులకు జీవనోపాధి కల్పిస్తుందని, పరస్పర సమ్మతితోనే మహిళలు శృంగారంలో పాల్గొంటారని, ఇందులో లైంగిక వేధింపులు, మహిళలను మోసం చేయడం వంటిది ఉండదని ఆమె పేర్కొనడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆమె వ్యాఖ్యలను సినీ పరిశ్రమలోని పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు.

క్యాస్టింగ్‌ కౌచ్‌ పేరిట సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గళమెత్తుతున్న నటి శ్రీరెడ్డి సరోజ్‌ ఖాన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ‘  ఈ వ్యాఖ్యలతో సరోజ్‌ ఖాన్‌పై గౌరవం పోయింది. సినీ పెద్ద అయిన ఆమె వర్థమాన నటీమణులకు మంచి దారిని చూపాలి. కానీ, నిర్మాతలకు బానిసలుగా ఉండాలంటూ తప్పుడు సంకేతాలు ఇచ్చే వ్యాఖ్యలు చేశారు’ అని శ్రీరెడ్డి ఏఎన్‌ఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు.

నటి, మోడల్‌ సోఫీ చౌదరి కూడా సరోజ్‌ ఖాన్‌ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. కొరియోగ్రాఫర్‌గా సరోజ్‌ఖాన్‌పై చాలా గౌరవం ఉంది. కానీ ఆమె తన హోదాతో ఇలాగేనా అమ్మాయిలను కాపాడేది? నేను ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం నుంచి రాకుంటే.. ముంబైకి వచ్చిన నెలరోజులకే లండన్‌ తిరగి వెళ్లిపోయేదాన్ని. ఇండస్ట్రీలో పరిస్థితులు అలా ఉన్నాయి’ అనిఆమె పేర్కొన్నారు. ‘తమ కలలను నిజం చేసుకోవడానికి అమ్మాయిలు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఆలోచిస్తే.. ఎంతో కష్టంగా తోస్తుంది. పని కోసం ముక్కు మొఖం తెలియనివారితో శారీకరంగా గడపాలని ఎవరూ కోరుకోరు. కానీ, ఇది ఒక్కటే మార్గం, అలా చేయకుంటే ముందుకు వెళ్లడం చాలా కష్టమనే భావనను కల్పిస్తున్నారు. దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన సమయం వచ్చింది’ అంటూ సోఫీ ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు