మాలాంటి వారికి ఆయనే స్ఫూర్తి

2 Jun, 2019 00:47 IST|Sakshi
రచితా రామ్, ఉపేంద్ర, సుదీప్, చంద్రు

– సుదీప్‌

‘‘ఉపేంద్ర లెగసీ వల్లే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి మాకంటూ ఒక పేరును సంపాదించుకుంటున్నాం. నాతో సహా చాలామందికి ఉపేంద్ర హార్డ్‌వర్క్, అంకితభావం స్ఫూర్తినిస్తాయి ’’ అని నటుడు, దర్శకుడు సుదీప్‌ అన్నారు. ఉపేంద్ర హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఐ లవ్‌ యు’. ‘నన్నే.. ప్రేమించు’ అనేది ఉపశీర్షిక. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రచితా రామ్‌ కథానాయికగా నటించారు. ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రంతో దర్శకుడిగా తెలుగు పరిశ్రమకు పరిచయమైన ఆర్‌. చంద్రు స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్‌ 14న ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. బెంగళూరులో ఈ సినిమా ప్రీ–రిలీజ్, ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమం జరిగింది.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ‘ఈగ’ ఫేమ్‌ సుదీప్‌ మాట్లాడుతూ– ‘‘ఉపేంద్ర ఇంట్రడక్షన్‌ సాంగ్‌ ట్రెండీగా ఉంది.  ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉంది. ఇది చూశాక ఉపేంద్రతో మళ్లీ పోటీపడాలనిపిస్తోంది. ఉపేంద్రలాంటి దర్శకులు ఇండస్ట్రీకి అవసరం. చంద్రు, ప్రేమ్‌ వంటి దర్శకులకు ఆయనే స్ఫూర్తి. ఆయన మరోసారి దర్శకత్వ బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘నాకు, సుదీప్‌కు 25ఏళ్లుగా పరిచయం ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి రోజుల్లో సుదీప్‌లో ఎంత ఫైర్‌ ఉందో ఇప్పుడూ అంతే ఉంది. దర్శకుడు చంద్రు అద్భుతమైన కథ రాసుకుని పెద్దకలలతో వచ్చాడు’’ అన్నారు ఉపేంద్ర. ‘‘ఉపేంద్రగారు అభిమానుల చక్రవర్తి. ఇండస్ట్రీ కీర్తిప్రతిష్ఠలను ఇతర చిత్రసీమలకు తీసుకెళ్లిన అభినయ చక్రవర్తి సుదీప్‌గారు.. త్వరలో విశాఖ తీరంలో తెలుగు వెర్షన్‌ పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు చంద్రు.

మరిన్ని వార్తలు