నేనెవరినీ పోటీగా భావించను - బాలకృష్ణ

10 Jan, 2016 01:39 IST|Sakshi
నేనెవరినీ పోటీగా భావించను - బాలకృష్ణ

  ‘‘నా సినిమాలు నాకే పోటీ. నేనెవరినీ పోటీగా భావించను. నా కొడుకు, మనవడు వచ్చినా సరే సినిమాలు చేస్తూనే ఉంటాను. ఎప్పుడూ మంచి సినిమాలు చేయడానికి నేను రెడీ’’ అని బాలకృష్ణ చెప్పారు. శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్ కాంబినేషన్‌లో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘డిక్టేటర్’. ఎస్.ఎస్. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం ఆడియో సక్సెస్ మీట్ శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ-  ‘‘నా ప్రతి సినిమా టైటిల్‌కు ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఈ చిత్రకథ, క్యారెక్టరైజేషన్స్ బాగా కుదిరాయి. శ్రీవాస్ రథసారధిగా ముందుండి నడిపించాడు. తమన్ చాలా డిఫరెంట్ ట్యూన్స్ అందించాడు. ఈ సినిమాలో అన్ని పాటలు బాగా కుదిరాయి. పాటలను అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. నాకు మ్యూజిక్, ఎడిటింగ్ విభాగాలు చాలా ఇష్టం. చిన్నా మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మంచి ప్లానింగ్‌తో, ఆహ్లాదకరమైన వాతావరణంలో షూటింగ్ సాగింది. అంజలి తన పాత్రకు న్యాయం చేసింది. ఈ చిత్రం సంక్రాంతికి మంచి కానుక.

అందరూ సకుటుంబ సపరివార సమేతంగా మళ్లీ మళ్లీ చూసే విధంగా ‘డిక్టేటర్’ ఉంటుంది’’ అన్నారు. ‘‘దర్శకుడిగా, నిర్మాతగా నేను రెండు రకాల పాత్రలు పోషించడానికి కారణం బాలకృష్ణగారు. నేనింత బాగా చేశానంటే దానికి కారణం ఆయనే. బాలకృష్ణగారి నమ్మకం నిలబెట్టాననే అనుకుంటున్నాను. అందరం ఫ్రెండ్లీగా ఉండటంతో ఈ సినిమా బాగా వచ్చింది. బాలకృష్ణగారు సెట్‌లో చాలా జోవియల్‌గా ఉండేవారు. తెరపై బాలకృష్ణగారిని ఇంకా బాగా చూపించాలన్న కసితో ఈ సినిమా కోసం పనిచేశాం.

విడుదలయ్యాక ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ పండగ చేసుకుంటారు’’ అని శ్రీవాస్ పేర్కొన్నారు. అంజలి మాట్లాడుతూ- ‘‘తమన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో కెమెరామ్యాన్ శ్యామ్ కె. నాయుడు చాలా అందంగా చూపించారు. బాలకృష్ణగారు మంచి మనసున్న వ్యక్తి’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటులు సుమన్, కాశీ విశ్వనాథ్, జీవా, అజయ్, హేమ, రచయితలు రత్నం, శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు తదితరులు పాల్గొన్నారు.