కోలీవుడ్‌ అంటేనే ఇష్టం

17 Sep, 2017 04:36 IST|Sakshi
కోలీవుడ్‌ అంటేనే ఇష్టం

తమిళసినిమా: తనకు తమిళ చిత్రపరిశ్రమ అంటేనే చాలా ఇష్టం అని ప్రముఖ నటి జయప్రద పేర్కొన్నారు. నినైత్తాలే ఇనిక్కుమ్‌ చిత్రంలో ఇటు కమలహాసన్, అటు రజనీకాంత్‌తో కలిసి నటించి మెప్పించిన నటి జయప్రదను కోలీవుడ్‌ ఎప్పటికీ మరచిపోదు. అయితే ఒక్క తమిళంలోనే కాకుండా, దక్షిణాది చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించి అగ్రనటిగా రాణించిన జయప్రద ఆ తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి నటనకు దూరం అయ్యారు. ఆ తరువాత అడపాదడపా తెలుగు చిత్రాల్లో ముఖ్యపాత్రల్లో కనిపించినా, కోలీవుడ్‌కు మాత్రం చాలా కాలం తరువాత యాగం అనే చిత్రం ద్వారా రీఎంట్రీ అవుతున్నారు. ఈ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో జరిగింది.

ఐదేళ్ల తరువాత మళ్లీ కోలీవుడ్‌కు
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జయప్రద మాట్లాడుతూ ఐదేళ్ల తరువాత తమిళ చిత్ర పరిశ్రమలోకి రీ ఎంట్రీ అవడం సంతోషంగా ఉందన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత మళ్లీ నటించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి కథా చిత్రం అయితే బాగుంటుందనిపించిదన్నారు. అలాంటి సమయంలో యాగం చిత్ర దర్శకుడు నరసింహ తనను కలిసి ఈ చిత్రంలో నటించాల్సిందిగా కోరారన్నారు. తను రెండేళ్లకు పైగా ఎంతో హోమ్‌ వర్క్‌ చేసి ఈ కథను తయారు చేశారని తెలిపారు. తాను పలు భాషల్లో నటించినా తమిళ చిత్ర పరిశ్రమ అంటే చాలా ఇష్టం అని పేర్కొన్నారు. తమిళంలో యాగం పేరుతోనూ, తెలుగులో శరభ పేరుతోనూ రూపొందుతోందని చెప్పారు.

ఇది మానవ శక్తి, దైవశక్తి, దుష్టశక్తి మధ్య జరిగే కథా చిత్రం అని వెల్లడించారు. ఇందులో కొడుకును కాపాడుకోవడానికి తపన పడే తల్లిగా తాను నటించానని, ఇది అభియనయానికి చాలా అవకాశం ఉన్న పాత్ర అని తెలిపారు. ఇక మంచి చిత్రంలో తానూ ఇక భాగం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని నటి జయప్రద పేర్కొన్నారు. ఏఎస్‌కే ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై అశ్వనీకుమార్‌ సహదేవ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఎన్‌.నరసిమ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు శంకర్‌ వద్ద పలు చిత్రాలకు సహాయదర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం. ఆకాశ్‌కుమార్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జయప్రద, నెపోలియన్, నాజర్, పోన్‌వన్నన్, ఎంఎస్‌.భాస్కర్, తనికెళ్లభరణి ముఖ్య పాత్రలను పోషించారు. కోటి సంగీతాన్ని అందించారు. చిత్రాన్ని అక్టోబర్‌ ప్రథమార్థంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా